మూసీ ఉగ్రరూపం…ఒక రోజు రికార్డు స్థాయిలో హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద..!

మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీ, ఈసీ నదుల ఉద్ధృతితో ఒక రోజు రికార్డు స్థాయిలో హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేయడంతో పరివాహక బస్తీలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. చాదర్‌ఘాట్‌, ముసారాంబాగ్‌ బ్రిడ్జి పైనుంచి పోటెత్తిన వరదతో రాకపోకలు నిలిచిపోయాయి. మహాత్మాగాంధీ బస్టాండ్‌ను చుట్టుముట్టిన వరదతో అధికారులు బస్సుల రాకపోకలు నిలిపివేశారు.

జియాగూడ, మూసారాంబాగ్ వరకు వరద ప్రభావం : హైదరాబాద్‌లో మహానగరంలో సన్నని పాయాలా కనిపించే మూసీ ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల నుంచి మొదలు గౌరెల్లి వరకు ప్రవాహ ఉద్ధృతితో దర్శనమిచ్చింది. బాపూఘాట్ నుంచి జియాగూడ, మూసారాంబాగ్ వరకు వరద ప్రభావం తీవ్రంగా కనిపించింది.

నీట మునిగిన ఓఆర్ఆర్ సర్వీస్‌ రోడ్డు : వికారాబాద్, తాండూరు, రంగారెడ్డి జిల్లా శివార్లలో కురిసిన కండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో జంట జలాశయాల నుంచి విడుదల చేసిన నీటితో జియాగూడ నుంచి మంచిరేవుల-నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్‌ రోడ్డు వరకు ప్రభావం కనిపించింది. నార్సింగి- మంచిరేవుల వద్ద సర్వీస్ రోడ్ కూడా నీట మునిగింది. దీంతో రాకపోకలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది…..
మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహం : హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూసీ నదిని ఆనుకుని ఉన్న మూసానగర్, రసూల్ పూర, వినాయకవీధి, శంకర్ నగర్, గోల్కాక పరిధిలోని ఇళ్లు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది..

ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు : నిత్యం వేలాది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్‌ను మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రయాణికుల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అప్రమత్తమైన యంత్రాగం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను లోనికి అనుమతించడం లేదని వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఎల్బీ నగర్, ఉప్పల్ స్టేషన్లకు తరలిస్తున్నట్లు తెలిపారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన : మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఎంజీబీఎస్‌ చేరుకున్న హైడ్రా కమిషనర్‌ ఎంజీబీఎస్‌లో పరిస్థితిని పరిశీలించారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. మలక్‌పేటలోని మూసానగర్‌లో వరద ఇళ్లను చుట్టుముట్టింది. మూసీ ప్రవాహంలో చిక్కుకున్న వారికి అధికారుల సాయం అందించారు. ముంపు ప్రాంతాల్లోని వారికి ఆహారం పంపిణీ చేస్తున్న అధికారులు మలక్‌పేట పరిధిలో బాధితులకు డ్రోన్‌ ద్వారా ఆహారం సరఫరా చేశారు..