టారిఫ్లతో పలు దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికాలో విదేశీ విద్యార్థులను కట్టడి చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విదేశీ విద్యార్థులను 15శాతానికి పరిమితం చేయాలంటూ యూనివర్సిటీలకు హుకుం జారీచేశారు. అమెరికా ప్రభుత్వ నిధులు పొందాలంటే 10 షరతులు పాటించాలంటూ అగ్రశ్రేణి యూనివర్సిటీలకు మెమోలు పంపించారు. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని ఆదేశించారు.
అమెరికా ప్రభుత్వం నుంచి నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పరిమితం చేయాలంటూ ట్రంప్ సర్కార్ ఆ దేశంలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు తేల్చిచెప్పింది. ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి, జాతి, లింగ ఆధారిత నియామకాలు నిలిపివేయడం, విద్యార్థుల అడ్మిషన్ సమయంలో కచ్చితంగా ప్రామాణిక పరీక్ష నిర్వహించడం వంటివి చేపడితేనే నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తుందని వెల్లడించింది. ఈ నిబంధనలను అంగీకరించిన వర్సిటీలు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందవచ్చని ఆ లేఖలో వెల్లడించింది. వీటిల్లో విద్యార్థులకు ప్రభుత్వ రుణాలు, గ్రాంట్లు, కాంట్రాక్టులు, రీసెర్చి నిధులు, విదేశీ స్కాలర్స్కు వీసా అనుమతులు, ట్యాక్స్ కోడ్లో ప్రాధాన్యం వంటివి పొందవచ్చని పేర్కొంది. అమెరికాలో ఉన్నత విద్యను పునర్ వ్యవస్థీకరించి తమ భావజాలానికి అనుకూలంగా మార్చుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గం చేస్తున్న మరో యత్నంగా దీనిని నిపుణులు భావిస్తున్నారు..
ట్రంప్ సర్కార్ షరతులు
విదేశీ విద్యార్థులపై కొత్త నిబంధనలు
విదేశీ వీసాలతో వచ్చే విద్యార్థుల సంఖ్య 15శాతం మించకూడదు. ఒకే దేశం నుంచి వచ్చే విద్యార్థులు 5శాతం కంటే ఎక్కువ ఉండరాదు.
విదేశాల నుంచి అందే నిధుల వివరాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి.
అడ్మిషన్, ఫైనాన్షియల్ ఎయిడ్.
విద్యార్థుల ప్రవేశం, ఆర్థిక సహాయం సమయంలో లింగం, జాతి, జాతీయత, రాజకీయ భావజాలం, జెండర్ ఐడెంటిటీ, లైంగిక ఆకర్షణ, మతం ఆధారంగా వివక్ష చూపకూడదు.
అండర్గ్రాడ్యుయేట్ అభ్యర్థులు SAT లేదా ACT వంటి ప్రామాణిక పరీక్ష ను పూర్తిల చేయాల్సిందే.
విద్యా స్వేచ్ఛ & క్యాంపస్ నియమాలు
విద్యా స్వేచ్ఛను కాపాడే విధానాలు అమలు చేయాలి. సంప్రదాయవాద ఆలోచనలకు విఘాతం కలిగించే యూనిట్లను తొలగించాలి.
రాజకీయ ప్రదర్శనలు, విద్యార్థుల వేధింపులు అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి.
ఉద్యోగులు విధి సమయంలో రాజకీయ ప్రసంగాలు, కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
బాత్రూం, లాకర్రూములు లింగ ఆధారంగా వేర్వేరుగా ఉండాలి.
ప్రోత్సాహకాలు
హార్డ్సైన్స్ విద్యార్థులకు ఉచిత ట్యూషన్ ఫీజు, అదనంగా 2 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రతిపాదించారు.
అమలు & శిక్షలు
ఈ నిబంధనల అమలును జస్టిస్ డిపార్ట్మెంట్ సమీక్షిస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే, సంబంధిత విద్యాసంస్థలకు రెండేళ్లపాటు ప్రభుత్వ లబ్ధిని నిలిపివేస్తారు
ఈ మేరకు శ్వేతసౌధం నుంచి లేఖలు అందుకొన్న వాటిలో అమెరికాలో MIT సహా ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నీ ఉన్నాయి. ఈ పది నిబంధనలు పాటించేందుకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ కార్యవర్గం యూనివర్సిటీలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ దిశలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రభుత్వంతో 500 మిలియన్ డాలర్ల డీల్ చేసుకునేందుకు చేరువైనట్లు సమాచారం..