అఫ్గాన్ మంత్రి ప్రెస్ మీట్ వివాదం పై, మహిళా జర్నలిస్టుల నిషేధం కేంద్రం వివరణ..!

అఫ్గనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై తలెత్తిన వివాదంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పందించింది. అఫ్గాన్ విదేశాంగ మంత్రి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. జర్నలిస్టులను ముత్తఖీ ఆహ్వానించలేదంటూ వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. విపక్షాలు కూడా మహిళా జర్నలిస్టులకు మద్దతుగా మాట్లాడాయి. ఈ క్రమంలో కేంద్రం స్పందించింది. ఆ ప్రెస్ మీట్తో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

అసలేం ఏమి జరిగింది?
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో శుక్రవారం ముత్తఖీ ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత దిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఒక్క మహిళ కూడా కనిపించలేదు. మహిళా జర్నలిస్టులు పాల్గొనకుండా అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, మహిళా జర్నలిస్టులను లోపలికి అనుమతించకపోవడంతో ఈ సమావేశంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ కొందరు మహిళా పాత్రికేయులు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తంచేశారు.సమావేశానికి కేవలం ఎంపిక చేసిన పురుష జర్నలిస్టులు, అఫ్గాన్ రాయబార కార్యాలయ అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఈ మీడియా సమావేశంలో ముత్తఖీ భారత్-అఫ్గాన్ సంబంధాలు, మానవతా సహాయం, వాణిజ్య మార్గాలు, భద్రతా సహకారం వంటి ప్రాంతీయ అంశాలపై మాట్లాడారు.

బీజేపీపై కాంగ్రెస్ ఫైర్
మహిళా జర్నలిస్టులను మీడియా సమావేశానికి అహ్వానించకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. భారత మహిళా జర్నలిస్టులకు అవమానంగా అభివర్ణించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.