రాజస్థాన్ జైసల్మేర్లో ఓ ప్రైవేట్ బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనం కాగా, 16 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. జైసల్మేర్ నుంచి జోధ్పూర్కు వెళ్తున్న బస్సు వార్ మ్యూజియం సమీపంలో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 50కి మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు..
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జవహర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, బాధితులకు తక్షణ సహాయం, వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు..
ప్రయాణికుల బస్సు మధ్యాహ్నం 3 గంటల సమయంలో జైసల్మేర్ నుంచి దిల్లీకి బయలుదేరింది. వారిలో చాలా మంది జోధ్పూర్కు వెళ్తున్నవారు ఉన్నారు. థైయత్ గ్రామం సమీపంలోని ఆర్మీ వార్ మ్యూజియం దాటి దాదాపు 20 కి.మీ దూరం వెళ్లన తరువాత, అకస్మాత్తుగా బస్సు వెనుక భాగం నుంచి పొగ రావడం ప్రారంభమైంది. తరువాత కొద్ది క్షణాల్లోనే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. దీనితో అందులోని ప్రయాణికులు చాలా మంది కాలిపోయారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయో ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఆర్మీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఓ గంట పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు” అని పోలీసులు తెలిపారు.
మరోవైపు ‘రోడ్డుపై పెద్ద ఎత్తున పొగ ఎగసిపడడం చూసి, అక్కడకు వెళ్లాను. తక్షణమే బాధితులను అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశాను. ఇది జరిగిన సుమారు 50 నిమిషాల తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చారు’ అని ప్రత్యక్ష సాక్షి మహేంద్ర సింగ్ తెలిపారు