ఏపీవైపు కు దూసుకొస్తున్న మొంథా తుపాను..!

ఏపీవైపు మొంథా తుపాను దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడింది. గంటకు 10కిలో మీటర్ల వేగంతో కదులుతూ పోర్ట్‌బ్లెయిర్‌కి 510 కిలో మీటర్లు, విశాఖపట్టణంకు 920, చెన్నైకి 890, కాకినాడకు 920, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు వెయ్యి కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది..ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారి.. 28వ తేదీన ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని.. అదేరోజు సాయంత్రం నుంచి రాత్రిలోపు కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని, బుధవారం ఉదయంకు తుపాను బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు..

తెలంగాణ‌లో వచ్చే మూడ్రోజులు వానలు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, వచ్చే 24గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నాటికి ఇది తీవ్ర తుపానుగా మారనున్నదని పేర్కొన్నది. ఈనెల 28న కాకినాడ సమీపంలో ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడ్రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో గంటలకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్టు వెల్లడించింది.