20 శాతం ఇస్తేనే టికెట్ల పెంపునకు అనుమతి..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 24 అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వర్షాన్ని లెక్క చేయకుండా సభ నిర్వహించిన సినీ కార్మిక నేతలను సీఎం అభినందించారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ కు సినీ పరిశ్రమను తరలించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఎంతో కృషి చేశారన్నారు.

చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం కృషి చేస్తామని, ఈ మేరకే దిల్ రాజు చైర్మన్ గా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశామన్నారు. ‘‘సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు. చిత్రపురి కాలనీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ గుర్తింపు వెనక కార్మికుల శ్రమ ఉంది. కార్మికులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేరాఫ్ కావాలన్నదే నా ఆలోచన. కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్ తీసుకొస్తాం. ఫ్యూచర్ సిటీలో సినీ ఇండస్ట్రీకి స్థలాలు కేటాయిస్తాం. మేం వచ్చాకే గద్దర్ పేరుతో అవార్డులిచ్చే కార్యక్రమం చేపట్టాం.’’ అని అన్నారు…

భారత్​ ఫ్యూచర్‌ సిటీలో సినీ పరిశ్రమ : తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్‌ పేరు మీద సినీ అవార్డులు ఇచ్చామని, భారత్​ ఫ్యూచర్‌ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు. సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్‌ స్థాయి పాఠశాల నిర్మించి ఉచితంగా చదువు చెప్పిస్తామని అన్నారు. సినీ కార్మికుల పిల్లలకు నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్య, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు..

20 శాతం ఇస్తేనే టికెట్ల పెంపునకు అనుమతి : సినీ కార్మికుల కోసం వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి, ప్రభుత్వం తరఫున అందులో రూ.10 కోట్లు డిపాజిట్‌ చేయనున్నట్లు మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం చేయగలిగిన పనులు చేస్తామన్న ఆయన సినిమా టికెట్ల పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇవ్వాలని నిర్మాతలకు సూచించారు. కార్మికులకు లాభాల్లో 20 శాతం ఇస్తేనే టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని అని సీఎం తెలిపారు. నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ దిల్‌ రాజు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.