హైదరాబాద్ లో మరోసారి నేపాలీ దొంగల గ్యాంగ్ రెచ్చిపోయింది. ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది. దాదాపు 50 లక్షల విలువైన బంగారు నగలు, నగదును అపహరించుకుపోయారు..సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ భారీ చోరీ జరిగింది. గన్ రాక్ ఎంక్లేవ్ లో నివాసం ఉండే ఆర్మీ రిటైర్డ్ కల్నల్ గిరి ఇంట్లో నేపాలీ దొంగల గ్యాంగ్ దొంగతనం చేసింది. ఇంట్లో పని చేసే నేపాల్ కు చెందిన దంపతులు.. మరో నలుగురితో కలిసి చోరీకి పాల్పడ్డాడు. సినీ ఫక్కీలో ఇంటి యజమాని కాళ్లు చేతులు కట్టేసి, మూతికి ప్లాస్టర్ వేసి నగదు నగలను అపహరించుకుని నేపాల్ దొంగల ముఠా పరార్ అయ్యింది. 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు లక్ష రూపాయల నగదుతో ఉడాయించారు. కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పక్కా ప్లాన్ తో చోరీ..
ఓనర్ గిరి ఇంట్లో లేని సమయం చూసి చోరీకి పక్కా స్కెచ్ వేశారు. మరో నలుగురి సాయంతో దంపతులు దోపిడీకి పాల్పడ్డారు. ఓనర్ గిరి ఫంక్షన్ నుంచి ఇంటికి రాగానే ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. జ్యూస్ లో మత్తుమందు కలిపి.. వారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. వారు ఇచ్చిన జ్యూస్ తాగి రిటైర్డ్ కల్నల్ గిరి భార్య స్పృహ కోల్పోయారు. అయితే, అనుమానం రావడంతో ఆ జ్యూస్ తాగకుండా స్పృహ కోల్పోయినట్లు గిరి నటించారు. నేపాలీ దంపతులు మరో నలుగురిని ఇంట్లోకి పిలిచి దోపిడీకి పాల్పడ్డారు. దొంగతనం సమయంలో ఓనర్ గిరి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గిరిపై దాడి చేసి ఆయనను తాళ్లతో బంధించారు..