స్థానిక సంస్థల ఎన్నికల్లో జీఓకు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయిస్తున్నారంటూ హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వేర్వేరుగా దాఖలైన 9 పిటీషన్లపై జస్టిస్ టి.మాధవి దేవి విచారణ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు 17 శాతానికి మించడంలేదని సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య పిటీషన్ దాఖలు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలుండగా 117 సర్పంచులను మాత్రమే బీసీలకు కేటాయించారని పిటీషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గెజిట్ 43ను జారీ చేశారని వాదించారు. దీని ప్రకారం బీసీ రిజర్వేషన్లు 19 శాతం మాత్రమే ఉన్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు బీసీ రిజర్వేషన్లు 17 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 46 విరుద్ధంగా ఈ రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన గెజిట్ ను రద్దు చేసి రిజర్వేషన్లు మళ్లీ కేటాయించాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వెల్దండ మండలం తిమ్మనోనిపల్లి రిజర్వేషన్లపైనా మరో పిటీషన్ దాఖలైంది. గ్రామంలో 8 వార్డులుండగా అన్నింటిని ఎస్సీ, ఎస్టీలకే కేటాయించారని, బీసీ జనాభా ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు పరిగణలోకి తీసుకోలేదని పిటీషనర్ తరఫు న్యాయవాది వాదించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచుల రిజర్వేషన్లు కేటాయించినట్లు స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి కోర్టుకు తెలిపారు. రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు మారుతూ వస్తాయని కోర్టుకు తెలిపారు. 2011 జనాభా గణనలో తప్పులున్నట్లు పిటీషనర్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారని, దీనికి కేంద్రమే సమాధానం చెప్పాల్సి ఉందని రాహుల్ రెడ్డి వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
నామినేషన్లు, భద్రత, పోలింగ్, ఎన్నికల కోడ్ అమలుపై చర్చ : గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులతో ఎస్ఈసీ రాణి కుముదినీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియతో పాటు భద్రత, పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై ఎస్ఈసీ చర్చించారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. అదనపు డీజీ మహేష్ భగవత్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ సృజన, తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు : పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో డిసెంబరు 11, 14, 17 తేదీల్లో నిర్వహించేందుకు తెలంగాణ ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, అదే రోజు 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచి ఎన్నికను సైతం నిర్వహిస్తారు…
292 వార్డులకు, 32 పంచాయతీలకు ఎన్నికల్లేవ్ : న్యాయస్థానాలు వివిధ కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామపంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25, కరీంనగర్ జిల్లా వి.సైదాపూర్ మండలంలోని 2, ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలోని 4 గ్రామ పంచాయతీలను, పెనుబల్లి మండలంలోని ఒక గ్రామ పంచాయతీని ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మినహాయించింది.
తెలంగాణలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. వాటికి 2024 సంవత్సరం జనవరిలో పదవీ కాలం పూర్తి అయింది. ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారులకు పాలనా బాధ్యతలు అప్పగించారు. బీసీలకు రిజర్వేషన్లను 42 % పెంపుదలతో సెప్టెంబరు 29న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబరు 9న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు నిలిచిపోయాయి. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 50 % రిజర్వేషన్ల పరిమితి మేరకే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. దాంతో తెలంగాణ ఎన్నికల సంఘం ఎన్నికలకు సమాయత్తం అయింది.
ఫిర్యాదుల స్వీకరణకు ఫోన్ నంబర్ : గ్రామ పంచాయతీల ఎన్నికలను పురస్కరించుకొని ఫిర్యాదులను, అర్జీలను స్వీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గ్రీవెన్స్ మాడ్యూల్ పేరిట ఆన్లైన్లో ఫిర్యాదులు చేయవచ్చని తెలిపింది. ఫిర్యాదుల స్వీకరణకు 92400 21456 ఫోన్ నంబర్ నిరంతరం పని చేస్తుందని వెల్లడించింది.