భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై భారీ మొత్తంలో టారిఫ్‌లు..!!

ఆమెరికా, భారత్‌ల మధ్య గత కొంత కాలం నుంచి ట్రేడ్ టాక్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ చర్చలు ఫలితాలను ఇవ్వటం లేదు. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు….ఈ సారి వ్యయసాయ దిగుమతులను ఆయన టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై ఆయన భారీ మొత్తంలో టారిఫ్‌లు విధించడానికి పూనుకున్నారు. తాజాగా, వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అమెరికా రైతులకు గుడ్‌న్యూస్ కూడా చెప్పారు…అక్కడి రైతులకోసం మల్టీ బిలియన్ డాలర్ రిలీఫ్ ఫ్యాకేజ్ ప్రకటించారు. భారత్, ఇతర ఆసియా దేశాలనుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై ఆయన విమర్శలు సైతం గుప్పించారు. ఇతర దేశాలనుంచి వస్తువుల్ని అమెరికాలోకి దిగుమతి చేసుకోవటం స్థానిక ఉత్పత్తిదారులకు సవాలుగా మారిందని అన్నారు. స్థానిక ఉత్పత్తిదారులను రక్షించటం కోసం, దిగుమతులకు అడ్డుకట్ట వేయటం కోసం భారీ మొత్తంలో టారిఫ్‌లు వేస్తామని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రైతులు ఎంతో అవసరమైన జాతీయ ఆస్థి. అమెరికాకు వెన్నెముక లాంటి వారు’ అని అన్నారు.

భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న బియ్యం గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘అమెరికా రీటేల్ రైస్ మార్కెట్‌లో రెండు అతి పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. వాటి సంగతి మేము చూసుకుంటాము. అది చాలా సులభం. మళ్లీ పెద్ద మొత్తంలో టారిఫ్‌లు వేస్తే రెండు నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. వాళ్లు మన దేశంలో బియ్యాన్ని డంప్ చేయకూడదు. అంటే నా ఉద్దేశ్యం.. దాని గురించి విన్నాను. మీరలా చేయకూడదు’ అని పరోక్షంగా భారత్‌ గురించి మాట్లాడారు. కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఎరువులపై కూడా ఆయన మాట్లాడారు. వాటిపై భారీ స్థాయిలో టారిఫ్‌లు వేస్తామన్నారు…

భారతీయ బియ్యం ఎగుమతులపై లెక్కలు

భారతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య (ఐఆర్ఈఎఫ్) డేటా ప్రకారం.. అమెరికాకు భారతీయ బియ్యం ఎగుమతుల మొత్తం విలువ దాదాపు 390 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా సుమారు రూ.3,510 కోట్లు ఉన్నట్లు తెలిసింది. ఇక అందులో బాస్మతి బియ్యం విలువ 337.10 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.3028 కోట్లుగా తేలింది. 2.74 లక్ష మెట్రిక్ టన్నుల పరిమాణం ఉంటుందని వెల్లడైంది. భారతీయ బాస్మతి బియ్యానికి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద మార్కెట్‌గా అమెరికా ఉంది.

ఇక బాస్మతియేతర బియ్యం విషయానికి వస్తే.. 61,341 మెట్రిక్ టన్నుల బియ్యం అమెరికాకు ఎగుమతి అయింది. దీని విలువ 54.64 మిలియన్ డాలర్లు అంటే.. మన కరెన్సీలో దాదాపు రూ.500 కోట్లుగా ఉంది. ఇక బాస్మతియేతర బియ్యానికి ప్రపంచంలోనే అమెరికా 24వ అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. అయితే భారత్‌పై ట్రంప్ సుంకాలు పెంచక ముందు భారతీయ బియ్యంపై 10 శాతం సుంకం మాత్రమే ఉండేది.. కానీ 50 శాతం సుంకాలు విధించిన తర్వాత అది కాస్తా 40 శాతానికి పెరిగింది.

గతంలో పెంచిన ఈ 50 శాతం సుంకాల పెంపు ప్రభావం కూడా భారత ఎగుమతులపై పెద్దగా పడటం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎందుకంటే పెరిగిన ఖర్చులో ఎక్కువ భాగం అధిక రిటైల్ ధరల రూపంలో అమెరికన్ వినియోగదారులపైనే విధిస్తున్నారని తెలిపాయి. ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ ప్రకారం.. భారతీయ బాస్మతికి ప్రత్యక్ష ప్రత్యామ్నాయం అమెరికాలో లభించే బియ్యం కాదని తెలిపారు. అంతేకాకుండా.. భారతీయ బాస్మతి బియ్యానికి దాని ప్రత్యేకమైన సువాసన, రుచి, పొడవు కారణంగా గల్ఫ్, దక్షిణాసియా ప్రాంతాల సాంప్రదాయ వంటకాలకు కీలక పదార్థంగా నిలుస్తోంది. ఇక బిర్యానీ వంటి వంటకాలకు బాస్మతి బియ్యం తప్పనిసరి.

అమెరికాలో భారతీయ బియ్యాన్ని ప్రధానంగా గల్ఫ్, మన భారతీయులు ఎక్కువగా వినియోగిస్తారు. భారతీయ వంటకాలకు అమెరికాలో రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతున్నందున భారత బియ్యానికి అక్కడ డిమాండ్ పెరుగుతోంది. కొత్తగా విధించే ఏ సుంకాల భారమైనా అమెరికన్ వినియోగదారులపైనే పడుతుందని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ అంచనా వేసింది. భారతీయ బియ్యం ఎగుమతి పరిశ్రమ బలంగా, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో ఉందని సంబంధిత రంగ నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఇతర దేశాలతో వాణిజ్య భాగస్వామ్యాన్ని భారత్ మరింత పెంచుకుంటోందని.. కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తోందని ఇండియన్ రైస్ ఎగుమతిదారుల వైస్ ప్రెసిడెంట్ దేవ్ గార్గ్ పేర్కొన్నారు..