భార్య కిడ్నీ దానం చేయడంతో.. కొత్త జీవితాన్ని పొందిన కమెడియన్ పంచ్ ప్రసాద్…!

భార్య కిడ్నీ దానం చేయడంతో.. కొత్త జీవితాన్ని పొందిన కమెడియన్ పంచ్ ప్రసాద్.. కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నారు. కాగా ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరీక్షల గురించి, ముఖ్యంగా కిడ్నీ వైఫల్యం, దాని వల్ల ఎదురైన భావోద్వేగ పోరాటం గురించి ఓ ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా పంచుకున్నారు. తన జీవితంలో దేవుడు అనేక కష్టాలను ఇచ్చాడని, ప్రొఫెషనల్‌గా విజయం సాధించినప్పటికీ ఆరోగ్యం సహకరించక వెనకబడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తన కిడ్నీ వైఫల్యానికి కారణం బీపీ అని, ఈ విషయం తనకు ముందుగా తెలియదని ప్రసాద్ వివరించారు. ఎంగేజ్‌మెంట్ తర్వాత తన భార్య ముక్కు నుంచి రక్తం కారడాన్ని గమనించి, వైద్య పరీక్షలు చేయించమని చెప్పడంతోనే కిడ్నీ సమస్య బయటపడిందని తెలిపారు. ఆ సమయంలో క్రియేటినిన్ స్థాయిలు అధికంగా ఉన్నాయని, అప్పటినుంచి డయాలసిస్ చేయించుకుంటున్నానని చెప్పారు. డయాలసిస్ తనకు ఒక నిత్యకృత్యంగా మారిందని, కొన్నిసార్లు స్టేజ్ మీద ప్రదర్శన ఇవ్వడానికి ముందు కూడా డయాలసిస్ చేయించుకున్నానని ఆయన తెలిపారు. ఒకానొక దశలో, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, శారీరక నొప్పితో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా తన మదిలోకి వచ్చాయని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో నటుడు, జబర్దస్త్ జడ్జ్ నాగబాబు ఫోన్ చేసి మద్దతు ఇవ్వడంతో పాటు, జబర్దస్త్ టీమ్‌ లీడర్స్, ఆర్టిస్టులు అందరూ కలిసి ఆపరేషన్ ఖర్చులకు డబ్బును సమకూర్చారని కృతజ్ఞతలు తెలిపారు. శ్రీను, రాంప్రసాద్ వంటి సహోద్యోగులు తనను ఆసుపత్రిలో చేర్చడంలో, ఆర్థిక సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.