100 గజాలలోపు ఖాళీ స్థలాల విషయంలో మంత్రి కీలక నిర్ణయం..!

తెలంగాణ హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బోర్డుకు సంబంధించిన అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో హౌసింగ్ బోర్డు అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో భూముల లీజు, కోర్టు కేసులు, బకాయిలు, అగ్రిమెంట్లపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు..హౌసింగ్ బోర్డు గతంలో కేటాయించిన ఇళ్లకు ఆనుకుని ఉన్న 100 గజాలలోపు ఖాళీ స్థలాల విషయంలో మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి యజమానులు ఆసక్తి చూపిస్తే, ఆ పక్కనే ఉన్న చిన్న స్థలాన్ని వారికి విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, గతంలో బోర్డు నుంచి ఇల్లు/స్థలం పొంది రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు..