ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. ఆయన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ తెలిపారు.
బీఆర్ఎస్లోనే ఉన్నట్లు స్పష్టం : ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. వారంతా సాంకేతికంగా బీఆర్ఎస్లోనే ఉన్నట్లు స్పష్టం చేస్తూ అరికెపూడి గాంధీ, మహిపాల్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్ అనర్హత పిటిషన్లను కొట్టేశారు.
ముగ్గురి ఎమ్మెల్యేలకు సంబంధించి గురువారం తీర్పు : మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 19న మరోమారు విచారణ జరగనుంది. 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్ కుమార్‌కు సంబంధించి గురువారం తీర్పు ఇవ్వనున్నారు.