బీజేపీ కి భారీ విరాళాలు…!

రాజకీయ నిధుల సమీకరణలో భారీ మార్పు కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్నికల సంఘానికి అందిన నివేదికల ప్రకారం, 9 ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు మొత్తం రూ.3,811 కోట్ల విరాళాలు అందాయి. 2023-24లో ఈ మొత్తం రూ.1,218 కోట్లుగా ఉండగా, కేవలం ఏడాది కాలంలోనే ఇది 212% పెరగడం గమనార్హం. ఈ భారీ విరాళాల్లో అధికార పార్టీ బీజేపీ (BJP) తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం విరాళాల్లో సుమారు 82 శాతం (రూ.3,112 కోట్లు) ఒక్క బీజేపీకే దక్కాయి. గత ఏడాదితో పోలిస్తే బీజేపీకి ఈ విధంగా అందిన విరాళాలు 4 రెట్లు పెరిగాయి.

పార్టీల వారీగా విరాళాలు..
బీజేపీ రూ.3,112 కోట్లు (82%)
కాంగ్రెస్ రూ.299 కోట్లు (8%)
ఇతర పార్టీలు రూ.400 కోట్లు (10%)

అగ్రస్థానంలో ‘ప్రుడెంట్’ ఎలక్టోరల్ ట్రస్ట్
రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడంలో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అత్యంత కీలకమైనదిగా నిలిచింది. ఇది మొత్తం రూ.2,668 కోట్లను పంపిణీ చేయగా, అందులో రూ.2,180 కోట్లు (82%) బీజేపీకే వెళ్ళాయి. టాటా గ్రూప్ మద్దతు ఉన్న ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.915 కోట్లను సేకరించి, అందులో రూ.757 కోట్లను బీజేపీకి అందించింది.