మంత్రి ఉత్తమ్‌కు కీలక బాధ్యతలు..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో పాగా వేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నోటిఫికేషన్‌కు ముందే పొత్తులు, ఎత్తులతో రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ సంవత్సరం తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏఐసీసీ నియమించింది. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకులను నియమించింది. త్వరలోనే అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అసోం ఎన్నికల పరిశీలకులుగా భూపేష్ భగేల్, డీకే శివకుమార్, బందు టిర్కి, కేరళకు సచిన్ పైలట్, కేజే జార్జ్, ఇమ్రాన్, కన్హయ్య కుమార్, తమిళనాడు, పుదుచ్చేరికి ముకుల్ వాస్కీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖాజీ మహమ్మద్ నిజాముద్దీన్, పశ్చిమ బెంగాల్‌కు సుదీప్ రాయ్ బర్మన్, షకీల్ అహ్మద్ ఖాన్, ప్రకాశ్ జోషిలను నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959