వ్యాపార భాగస్వామి వేధింపులతోనే నా తండ్రి ఆత్మహత్య…నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కుమారుడి డిమాండ్..!.

వ్యాపార భాగస్వామి వేధింపులతోనే నా తండ్రి ఆత్మహత్య.

– నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కుమారుడి డిమాండ్.

– దేవరకొండ పోలీసుల తీరుపై బాధితుల ఆవేదన.

దేవరకొండ, తన తండ్రి ఆత్మహత్యకు వ్యాపార భాగస్వామి చేసిన ఆర్థిక మోసాలు, వేధింపులే కారణమని బాధితుడి కుమారుడు అజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం దేవరకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు.

అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తన తండ్రి నయన్ భాస్కర్ గత మూడు దశాబ్దాలుగా మార్పాకుల కుటుంబంతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. గత 11 ఏళ్లుగా అశోక్ గౌడ్‌తో కలిసి ఫెర్టిలైజర్ షాపును నడుపుతున్నారు. తన తండ్రి చిట్టీల వ్యాపారం ద్వారా సంపాదించిన సొమ్మునంతా సదరు దుకాణంలోనే పెట్టుబడిగా పెట్టారు. అయితే, గత కొంతకాలంగా వ్యాపార లెక్కల విషయంలో అశోక్ గౌడ్ మోసం చేస్తున్నారని, అసలు పెట్టుబడి అడిగితే ఇవ్వకుండా మానసికంగా వేధించారని అజయ్ ఆరోపించారు.

సూసైడ్ నోట్ ఉన్నా చర్యలు శూన్యం: వేధింపులు భరించలేక తన తండ్రి ఫెర్టిలైజర్ షాపులోనే ఆత్మహత్య చేసుకున్నారని, చనిపోయే ముందు “నా చావుకు మార్పాకుల అశోక్ గౌడ్ కారణం” అని తండ్రి రాసిన లేఖను అజయ్ మీడియాకు చూపారు. ఇంతటి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తామని నమ్మించిన సురేష్ గౌడ్ వంటి వారు కూడా తమను మోసం చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959
.