హుజూర్నగర్ దస్తావేజులేఖరుల నూతన అధ్యక్షుడిగా షేక్ జానీ పాషా ఎన్నిక.
*కోశాధికారిగా షేక్ నాగుల్ మీరా ఎంపిక.. రైటర్ల ఐక్యతే బలం.. సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం*
హుజూర్‌నగర్‌లో శనివారం నిర్వహించిన దస్తావేజులేఖరుల సమావేశంలో నూతన అధ్యక్షుడిగా షేక్ జానీ పాషా, కోశాధికారిగా షేక్ నాగుల్ మీరా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తోటి దస్తావేజులేఖరుల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని నూతన కార్యవర్గ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రైటర్ల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సమష్టిగా ఎదుర్కొంటామని, వృత్తిపరంగా ఎదురవుతున్న సమస్యలపై రాజీ లేకుండా పోరాడి పరిష్కారం సాధించడమే నూతన నాయకత్వం ముందున్న ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యాలయాల వద్ద ఎదురయ్యే ఇబ్బందులు, వృత్తిపరమైన సమస్యలు, రైటర్ల హక్కుల పరిరక్షణ విషయంలో ప్రతి ఒక్కరికీ అండగా నిలవాలని నిర్ణయించారు. పదవులు అలంకారప్రాయంగా కాకుండా ప్రతి రైటర్‌కు భరోసానిచ్చే బాధ్యతలుగా నిర్వహించాలని, వ్యక్తిగత సమస్యలను సైతం సమష్టి సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేయాలని సభ్యులు సూచించారు. రైటర్ల మధ్య ఐక్యత ఉంటేనే హక్కుల పరిరక్షణ సాధ్యమని, అందరూ కలిసికట్టుగా ఉంటూ వృత్తి గౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ దస్తావేజులేఖరులు హలీం, అబ్దుల్ రజాక్, అష్రాఫ్‌తో పాటు నరేందర్ రెడ్డి, సాగర్, జావిద్, నబీ, షాకీర్, శివ, వినోద్, నూతన అధ్యక్షుడు షేక్ జానీ పాషా తదితర దస్తావేజులేఖరులు పాల్గొన్నారు.