జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం.ఆర్థిక సర్వే కీలక ప్రతిపాదనలు..

టీవీలోనో, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పైనో కనిపించే రంగురంగుల ‘క్రిస్పీ’ చిప్స్, నోరూరించే కూల్ డ్రింక్స్ ప్రకటనలు చూసి మురిసిపోతున్నారా? అయితే జాగ్రత్త! ఆ ఆకర్షణీయమైన ప్యాకెట్ల వెనుక ప్రాణాంతకమైన ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులు పొంచి ఉన్నాయి. దేశంలో యువత మరియు పిల్లల ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంపై భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024-25 (Economic Survey 2024-25) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు (UPF) – అంటే మనం పిలిచే ‘జంక్ ఫుడ్'(Junk Food)పై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది…
యువత, చిన్నారుల ఆరోగ్యాన్ని హరిస్తున్న ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్’ (UPF)పై కేంద్ర ప్రభుత్వం గట్టి నిఘా ఉంచబోతోంది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పుతో నిండిన జంక్ ఫుడ్స్ వినియోగంపై ఆర్థిక సర్వే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఆకర్షణీయమైన ఆహార ప్రకటనలే మన అనారోగ్యానికి మూలమని గుర్తిస్తూ, వాటిపై కఠినమైన ఆంక్షలు విధించాలని సూచించింది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీ, సోషల్ మీడియాలో ఇలాంటి ఆహార పదార్థాల మార్కెటింగ్‌ను పూర్తిగా నిషేధించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది..