రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబటి రాంబాబు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు…

ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాలు ఏర్పాటుచేసి.. ఉదయం 4 గంటలకు ఆయన్ని తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ అభిమానులు ఆందోళనలు చెయ్యకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ కేసులో ఫిబ్రవరి 1 రాత్రి గుంటూరులోని వికాస్ నగర్‌లో అంబటి నివాసాన్ని ముట్టడించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఫిబ్రవరి 2న గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో అంబటి రాంబాబును హాజరుపరిచారు. ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యల కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. మరో కేసులో స్టేషన్ బెయిల్ మంజూరైంది.

ఈ ఘటనకు ముందు, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు, మహిళలు ఆయన ఇంటి, పార్టీ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారని సమాచారం. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కోర్టు విచారణలో అంబటి రాంబాబు భావోద్వేగంగా మాట్లాడారు. పోలీసులు తనను శారీరకంగా వేధించారనీ, రాత్రి 2:30 గంటల సమయంలో సెల్ నుంచి బయటకు తీసి అవమానకరంగా నిలబెట్టారని ఆరోపించారు. “పైనుంచి ఒత్తిడి ఉంది” అని సీఐలు చెప్పారని తెలిపారు. జడ్జి ఈ ఫిర్యాదులను నమోదు చేశారు.

పోలీసులు మాత్రం అంబటిపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయనీ, ఆయన వ్యాఖ్యలు సామాజిక శాంతికి భంగం కలిగిస్తాయనీ, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని కోర్టుకు తెలిపారు. ఆయనను విడుదల చేస్తే రాష్ట్రవ్యాప్త అశాంతి జరిగే ప్రమాదముందని వాదించారు.

వైసీపీ ఈ అరెస్టును రాజకీయ కక్షతో కూడిన అక్రమ చర్యగా ఖండిస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంబటితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే టీడీపీ శ్రేణులు అంబటి వ్యాఖ్యలు అసహనీయమనీ, న్యాయం జరిగిందని అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు అంబటి రాంబాబు.. పైకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.

ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అంబటి నివాసం దగ్గర భద్రతను పెంచారు. ఈ పరిణామాలు టీడీపీ, వైసీపీ మధ్య అగ్గి రాజేస్తున్నాయి. జనసేన మాత్రం ఈ వివాదాలపై మౌనంగా ఉంటోంది.