పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్….

టీ20 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఈ విజయంతో, భారత జట్టు సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు విజయాలతో ఆ జట్టు గ్రూప్ A పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది..ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేశాడు. సైమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు..

అటు ఇషాన్‌.. ఇటు స్పిన్నర్లు

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ పాక్‌ స్పిన్నర్ల ధాటికి రెండు రకాలుగా సాగింది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తున్నా ఓపెనర్‌ ఇషాన్‌ ధనాధన్‌ ఆటతీరుతో వహ్వా అనిపించాడు. అతడి ఎడాపెడా షాట్లతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. కానీ తన నిష్క్రమణ తర్వాత అదే పిచ్‌పై మిగతా బ్యాటర్లకు టర్నింగ్‌ బంతిని ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. పాక్‌ ఏకంగా ఆరుగురు స్పిన్నర్లను బరిలోకి దించి 18 ఓవర్లను వేయించడం విశేషం. దీంతో క్రీజులో తిలక్‌, సూర్య, దూబే ఉన్నప్పటికీ ఆశించిన మేర పరుగులు సాధించలేకపోయింది. వారు భారీ షాట్లకు ప్రయత్నించినా మైదానం పెద్దది కావడంతో బంతి బౌండరీ దాటడం గగనమైంది. ముఖ్యంగా సయీమ్‌ అయూబ్‌ బంతిని అద్భుతంగా టర్న్‌ చేసి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. ఇదంతా ఓ వైపు.. కానీ ఆరంభంలో ఇషాన్‌ ఆడిన తీరుకు పాక్‌ బౌలర్లలో వణుకు పుట్టింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ను కెప్టెన్‌ సల్మాన్‌ వేయడమే కాకుండా ప్రమాదకర అభిషేక్‌ను డకౌట్‌ చేశాడు. తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లో అభిషేక్‌కిది నాలుగో డకౌట్‌ కావడం గమనార్హం. రెండో ఓవర్‌ పేసర్‌ షహీన్‌కు ఇవ్వగా.. ఇషాన్‌ 6,4 తిలక్‌ 4తో 15 రన్స్‌ వచ్చాయి. స్పిన్నర్‌ అబ్రార్‌ తొలి ఓవర్‌లోనూ ఇషాన్‌ 6,4తో చెలరేగడంతో పవర్‌ప్లేలో జట్టు 52/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అందులో ఇషాన్‌వే 42 పరుగులుండడం విశేషం. ఆ తర్వాతా తన ధాటిని కొనసాగిస్తూ ఏడో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో విరుచుకుపడిన ఇషాన్‌.. స్పిన్నర్‌ షాదాబ్‌ ఓవర్‌లో 6,4తో 17 రన్స్‌ రాబట్టాడు. ఓవర్‌కు పది పరుగుల రన్‌రేట్‌తో స్కోరుబోర్డు దూసుకెళుతున్న వేళ స్పిన్నర్‌ సయీమ్‌ భారత్‌కు షాక్‌ ఇచ్చాడు. తొమ్మిదో ఓవర్‌లో అతడు ఇషాన్‌ను బౌల్డ్‌ చేయడంతో రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఒక్కసారిగా స్కోరు నెమ్మదించింది. స్పిన్నర్లు ప్రభావం చూపడంతో తిలక్‌-సూర్య జోడీ భారీ షాట్లకు వెళ్లే సాహసం చేయలేదు. దీనికి తోడు 15వ ఓవర్‌లో సయీమ్‌ డబుల్‌ ఝలక్‌ ఇస్తూ వరుస బంతుల్లో తిలక్‌, హార్దిక్‌ (0)ల వికెట్లు తీశాడు. 18వ ఓవర్‌లో సూర్య 4, దూబే (27) 6 తో 14 రన్స్‌తో స్కోరు 150 దాటింది. కానీ తర్వాతి ఓవర్‌లోనే సూర్యను తారిఖ్‌ అవుట్‌ చేయగా.. చివరి ఓవర్‌లో జట్టు 16 రన్స్‌ సాధించి రెండు వికెట్లను కోల్పోయింది…