ఆరు గ్యారంటీల అమలును డిమాండ్ చేస్తూ ఒక ప్రైవేట్ మెంబెర్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతాము.. కేటీఆర్..

ఆరు గ్యారంటీల అమలును డిమాండ్ చేస్తూ ఒక ప్రైవేట్ మెంబెర్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతాము

కోటి 67 లక్షల మంది మహిళలకు ఇస్తానన్న రూ.2500 కోసం ప్రైవేట్ మెంబెర్ బిల్లు ప్రవేశపెడతాము

రూ.4 వేలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న 46 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, నేతన్నల కోసం ప్రైవేట్ మెంబెర్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతాము

లక్షలాది మంది దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని ప్రైవేట్ మెంబెర్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతాము – కేటీఆర్..

కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ..

నాడు ‘జై తెలంగాణ’ నినాదంతో ప్రజలందరినీ ఏకం చేసి రాష్ర్టాన్ని ఏవిధంగా సాధించామో, ఇప్పుడు ‘సేవ్‌ తెలంగాణ’ నినాదంతో కాంగ్రెస్‌ అనే అనకొండ నుంచి రాష్ర్టాన్ని రక్షించుకుందామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. దొంగ-చీకటి ఏకమైనట్టుగా రెండు జాతీయ పార్టీలు ఏకమై తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మరింత ధాటిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. వెయ్యి గొంతుకలతో చట్టసభలతోపాటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ తీరును ఎండగడుదామని చెప్పారు…అభూత కల్పనలు, అడ్డగోలు హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్‌ దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి లాటరీ సీఎం అయితే, కేసీఆర్‌ ఒక హిస్టరీ అని అభివర్ణించారు. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని గోలొండ రిసార్ట్‌లో మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో అనేక అంశాలపై లోతుగా చర్చించారు.

సీనియర్‌ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమనిబంధనలపై అవగాహన కల్పించారు. అనుసరించాల్సిన వ్యూహాలపై, అప్పులు, ఆదాయాలు, హామీల ఎగవేతలు తదితర అంశాలపై గణాంకాలు సహా సభ, ప్రజల దృష్టికి ఎలా తీసుకెళ్లాలో కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. సభలో ప్రతిక్షణం అలర్ట్‌గా ఉంటూ సమయ స్ఫూర్తితో వ్యవహరించాలని తెలిపారు. జీఆరో అవర్‌లో లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానాలు ఇవ్వకపోవడంపై బీఏసీ సమావేశంలో సీనియర్‌ సభ్యులు నిలదీయాలని సూచించారు.

సోషియో ఎకనామిక్‌ సర్వే, ఆర్బీఐ, కాగ్‌ లెక్కలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని, కాంగ్రెస్‌ సర్కార్‌ ఓపెన్‌ మార్కెట్‌లో తీసుకున్న అప్పులు, ఆదాయం లేని కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల వివరాలను గణాంకాలు సహా వివరించాలని చెప్పారు. రెండేండ్లలో రికార్డు స్థాయిలో అప్పులు చేసిన కాంగ్రెస్‌ సర్కార్‌.. గత బీఆర్‌ఎస్‌పై నెపం నెడుతున్నదని, పార్లమెంట్‌ చెప్పిన సమాధానాన్ని మరోసారి సభలో వివరించాలని కోరారు. కష్టసమయంలోనే సంతోషం విలువ తెలుస్తుందని, సమిష్టిగా, దృఢంగా ప్రజల తరఫున కాంగ్రెస్‌ సర్కార్‌ను నిలదీద్దామని పిలుపునిచ్చారు.