ఇంధన భద్రతకు సంబంధించి ఒక కీలక విజయం. మార్గం గుండా భారతదేశానికి వచ్చిన మొదటి నౌకగా ఇది రికార్డు…!

ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన తరుణంలో, భారత ఇంధన భద్రతకు సంబంధించి ఒక కీలక విజయం నమోదైంది. లిబేరియా జెండాతో ఉన్న ‘షెన్‌లాంగ్’ అనే సూయజ్‌మాక్స్ ట్యాంకర్, ఇరాన్ దాడుల భయంతో షిప్పింగ్ కంపెనీలు వణికిపోతున్న వేళ, వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి మార్చి 12 (బుధవారం) మధ్యాహ్నం ముంబై పోర్టుకు చేరుకుంది..ఇరాన్-అమెరికా ఘర్షణల అనంతరం ఈ ప్రమాదకర మార్గం గుండా భారతదేశానికి వచ్చిన మొదటి నౌకగా ఇది రికార్డు సృష్టించింది.

సౌదీ అరేబియాలోని రాస్ తానూరా పోర్టు నుంచి మార్చి 3న … 1,35,335 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో బయలుదేరిన ఈ నౌక ప్రయాణం ఆరంభం నుండి ఉత్కంఠగా సాగింది. మార్చి 8న హార్ముజ్ జలసంధి సమీపంలోకి రాగానే, శత్రు దాడులకు లక్ష్యం కాకుండా ఉండేందుకు ఈ ట్యాంకర్ తన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) మరియు ట్రాన్స్‌పాండర్లను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రాడార్ల నుండి మాయమైన ఈ నౌక, అత్యంత సున్నితమైన ప్రాంతాన్ని దాటిన తర్వాత మార్చి 9న తిరిగి ట్రాకింగ్ వ్యవస్థలలో కనిపించింది. ఈ సాహసోపేతమైన ఆపరేషన్‌కు భారత నౌకాదళ కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సంధూ నాయకత్వం వహించారు.

షెన్‌లాంగ్ నౌక ప్రయాణిస్తున్న సమయంలోనే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కీలక ప్రకటన చేసింది. తమ అనుమతి లేకుండా జలసంధిని దాటే నౌకలు దాడులకు గురవుతాయని హెచ్చరించింది. హెచ్చరికలను విస్మరించిన ‘ఎక్స్‌ప్రెస్ రోమ్’, ‘మయూరీ నారీ’ అనే రెండు నౌకలు బుధవారం ఇరాన్ దాడుల్లో చిక్కుకున్నట్లు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు సేవ చేయని నౌకలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో, షెన్‌లాంగ్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది..