కోల్‌కతా నైట్‌రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. అటు సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటు, బంతితో అదరగొట్టిన చెన్నై 32 పరుగులతో కోల్‌కతాపై గెలిచింది. మరోవైపు నైట్‌రైడర్స్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నాలుగింట్లో ఓడగా.. ఓ మ్యాచ్ రద్దయ్యింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48), బ్రెవిస్ (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), ఆయుష్ మాత్రే (17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) రాణించారు. కార్తీక్ త్యాగికి రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 160/7 స్కోరుకే పరిమితమై ఓడింది. రమణ్‌దీప్ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 35), పోవెల్ (31 నాటౌట్), రహానె (28), రఘువంశీ (27) ఫర్వాలేదనిపించారు. 3 వికెట్లు తీసిన చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు…
కేకేఆర్ చివరిలో మెరుపులు మెరిపించినా, అది ఏమాత్రం సరిపోలేదు. చేపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే సునాయాస విజయాన్ని కైవసం చేసుకుంది. రమన్‌దీప్ సింగ్ చివరి ఓవర్‌ను ఒక తెలివైన బౌండరీతో ప్రారంభించగా, చివర్లో రోవ్‌మన్ పావెల్ ఒక సిక్స్ జోడించాడు, కానీ అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది…
ఛేదనలో కేకేఆర్ బ్యాటర్లు తడబడ్డారు. పేసర్లు ఖలీల్, అన్షుల్ ఆరంభంలో ఇబ్బందిపెట్టగా.. మధ్య ఓవర్లలో నూర్ కీలక వికెట్లతో కుదురుకోనీయలేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన నరైన్ (24) ఉన్న కాసేపు బ్యాట్ ఝుళిపించాడు. మరో ఓపెనర్ ఆలెన్ (1) నిరాశపర్చాడు. కెప్టెన్ రహానె, రఘువంశీ మాత్రం మూడో వికెట్‌కు 50 రన్స్ జోడించారు. రహానె, గ్రీన్ (0)లను వరుస బంతుల్లో నూర్ అవుట్ చేయడం మరింతగా దెబ్బతీసింది. రింకూ (6)ను కూడా నూర్ పెవిలియన్‌కు చేర్చడంతో కేకేఆర్ 90/6 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. అటు సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరగడంతో చివర్లో పోవెల్, రమణ్‌దీప్ పోరాటం సరిపోలేదు..