సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో వరుస విజయం..!

సొంతగడ్డపై జోరును ప్రదర్శిస్తూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో వరుస విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్‌ స్టేడియంలో చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (22 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్లాసెన్‌ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా… అన్షుల్‌ కంబోజ్, ఒవర్టన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

అనంతరం చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. మాథ్యూ షార్ట్‌ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), ఆయుశ్‌ మాత్రే (13 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించగా, ఇషాన్‌ మలింగకు 3 వికెట్లు… నితీశ్‌ కుమార్‌ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం రాగా, ప్రఫుల్‌ హింగే 7 పరుగులే ఇచ్చాడు.

కెప్టెన్‌ విఫలం…
షార్ట్‌ వేసిన తొలి ఓవర్లో 4 పరుగులే రావడంతో రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ప్రశాంతంగా మొదలైంది. అయితే ఆ తర్వాత అభిషేక్‌ శర్మ దూకుడు మొదలైంది. తర్వాతి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్‌ బాదిన అభిషేక్‌… కంబోజ్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అయితే మరో ఎండ్‌లో ముకేశ్‌ ఓవర్లో 3 ఫోర్లు బాది ధాటిని పెంచినట్లు కనిపించిన ట్రవిస్‌ హెడ్‌ (20 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.

హెడ్‌ను అవుట్‌ చేసిన ముకేశ్‌ తర్వాతి బంతికే కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (0) వికెట్‌ కూడా తీయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 75 పరుగులకు చేరింది. కొద్దిసేపటికే ఒవర్టన్‌ తన తొలి ఓవర్లోనే అభిషేక్‌ను వెనక్కి పంపించాడు. ఈ దశలో క్లాసెన్‌ కొన్ని చక్కటి షాట్లతో స్కోరు పెంచే బాధ్యత తీసుకున్నాడు.

మరోవైపు అనికేత్‌ వర్మ (2) ప్రభావం చూపలేకపోగా, ఉప్పల్‌లో గత రెండు మ్యాచ్‌లలో రాణించిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి (12; 1 సిక్స్‌) ఈసారి విఫలమయ్యాడు. నూర్‌ అహ్మద్‌ ఓవర్లో భారీ సిక్స్‌ కొట్టిన క్లాసెన్‌ 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. చివర్లో సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేసి ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమయ్యారు. ఆఖరి 4 ఓవర్లలో రైజర్స్‌ 31 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు చేజార్చుకుంది..

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) సామ్సన్‌ (బి) ఒవర్టన్‌ 59; హెడ్‌ (సి) రుతురాజ్‌ (బి) ముకేశ్‌ 23; ఇషాన్‌ కిషన్‌ (సి) రుతురాజ్‌ (బి) ముకేశ్‌ 0; క్లాసెన్‌ (బి) కంబోజ్‌ 59; అనికేత్‌ (సి) నూర్‌ (బి) ఒవర్టన్‌ 2; నితీశ్‌ రెడ్డి (సి) షార్ట్‌ (బి) ఒవర్టన్‌ 12; అరోరా (సి) బ్రెవిస్‌ (బి) గుర్‌జప్‌నీత్‌ 13; లివింగ్‌స్టోన్‌ (సి) బ్రెవిస్‌ (బి) కంబోజ్‌ 1; శివాంగ్‌ (సి) గుర్‌జప్‌నీత్‌ (బి) కంబోజ్‌ 12; హింగే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1-75, 2-75, 3-93, 4-112, 5-147, 6-177, 7-179, 8-193, 9-194. బౌలింగ్‌: షార్ట్‌ 3-0-38-0, ముకేశ్‌ చౌదరి 2-0-21-2, కంబోజ్‌ 3-0-22-3, నూర్‌ 4-0-33-0, ఒవర్టన్‌ 4-0-37-3, గుర్‌జప్‌నీత్‌ 4-0-34-1.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) క్లాసెన్‌ (బి) నితీశ్‌ రెడ్డి 7; రుతురాజ్‌ (సి) అరోరా (బి) మలింగ 19; మాత్రే (సి) క్లాసెన్‌ (బి) నితీశ్‌ రెడ్డి 30; షార్ట్‌ (సి) అనికేత్‌ (బి) మలింగ 34; సర్ఫరాజ్‌ (సి) నితీశ్‌ రెడ్డి (బి) మలింగ 25; బ్రెవిస్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) శివాంగ్‌ 0; దూబే (బి) సాకిబ్‌ 21; ఒవర్టన్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) హింగే 16; కంబోజ్‌ (నాటౌట్‌) 13; నూర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1-15, 2-66, 3-66, 4-112, 5-113, 6-148, 7-154, 8-182. బౌలింగ్‌: ప్రఫుల్‌ హింగే 4-0-60-1, నితీశ్‌ రెడ్డి 4-0-31-2, సాకిబ్‌ 4-0-32-1, ఇషాన్‌ మలింగ 4-0-29-3, శివాంగ్‌ 3-0-18-1, అభిషేక్‌ 1-0-13-0..