ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఒకవైపు వేసవి ఎండలు, ఉక్కపోత, వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. మరో వైపు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అదే సమయంలో 18 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తలు నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.ఏపీపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ కారణంగా గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతోపాటు.. ఏలూరు, చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. భారీ ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షితమైన ప్రాంతంకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ఏపీలో ఇవాళ ఎండలుసైతం రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రత ఎక్కువగానే ఉంది. కర్నూలు జిల్లాలోని తోవిలో అత్యధికంగా 41.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, గుర్తేడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు, ఏలూరు జిల్లా వేలేరుపాడు, పోలవరం జిల్లా కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.