సుబేదారి పోలీస్ స్టేషన్లో కేటీఆర్‌పై కేసు నమోదు
*బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సుబేదారి పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 504, 505 కింద కేసు నమోదు చేశారు.*
రైతు సంగ్రామ సదస్సులో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి సీపీ సన్‌ప్రీత్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల మెట్లెక్కింది. హన్మకొండ వేదికగా నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ ఆయన వాడిన పదజాలంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బుధవారం హన్మకొండలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో కేటీఆర్ అత్యంత పదునైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని, సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వాడిన కొన్ని పదాలు రాజకీయ హుందాతనాన్ని దాటాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి అసభ్యకర పదజాలం వాడటం సమంజసం కాదని వారు మండిపడుతున్నారు.
కేటీఆర్ ప్రసంగం ముగిసిన వెంటనే వరంగల్ రాజకీయాల్లో వేడి పెరిగింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని, కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని వారు ధ్వజమెత్తారు. వెంటనే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు ప్రాథమిక విచారణను వేగవంతం చేశారు. కేటీఆర్ ప్రసంగంలోని క్లిప్పింగులను, ఫిర్యాదుదారుల స్టేట్మెంట్లను పరిశీలించిన అనంతరం సీఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో క్రిమినల్ కేసులు నమోదు చేశారు