బీహార్ నుంచి కోస్తా ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి..!

హెచ్చరికలు

ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం తీసుకోవాలి.

పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దు.

రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉరుములతో వర్షం పడేటప్పుడు చెట్ల క్రిందకు వెళ్లకూడదు (రైతులు, పశుకాపరులు ప్రత్యేక జాగ్రత్త).

వాతావరణం అనూహ్యంగా మారవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.

బీహార్ నుంచి కోస్తా ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావం వల్ల శ్రీలంక మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా, రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు.

30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు : ఈ అల్పపీడన వ్యవస్థ ప్రభావం వల్ల, ఈ వారం గురువారం వరకు కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలోని కొన్ని భాగాల్లో మేఘావృత వాతావరణం నెలకొంటుందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం: రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

వాతావరణ మార్పులు దృష్ట్యా ప్రజలు అప్రమత్తం : ఈ వాతావరణ పరిస్థితుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. పంటలకు నివాస గృహాలకు సంభవించే నష్టాన్ని తగ్గించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సలహా ఇచ్చారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండటం అధికారులు జారీ చేసే సూచనలను కచ్చితంగా పాటించడం అత్యంత ఆవశ్యకమని అధికారులు నొక్కి చెప్పారు.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి : గత కొన్ని రోజులుగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నప్పటికీ, వేడి తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో అత్యధికంగా 40.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోతతో కూడిన తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నంద్యాల జిల్లాలోని పాణ్యం ప్రాంతంలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాకుండా, పోలవరం జిల్లా పరిధిలోని వి.ఆర్. పురం ప్రాంతంలో కూడా 40.6 డిగ్రీల మేర తీవ్రమైన వేడి వాతావరణం నెలకొన్నట్లు అధికారులు తెలిపారు.

పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం: కొన్ని ప్రాంతాలు తీవ్రమైన ఎండ వేడిమిలో మలమల మండిపోతుండగా, మరికొన్ని జిల్లాల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో అత్యధికంగా 16.2 మిల్లీమీటర్ల (mm) వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో 12 mm వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో కూడా 12 mm వర్షపాతం నమోదైంది. ఉప్పుమాగులూరు ప్రాంతంలో 10.5 mm వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ జిల్లాలకు వర్ష సూచన: ఈ వారాంతంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఒక సూచన జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, బాపట్ల , పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.