తమిళనాడు అసెంబ్లీ నేడు ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయ్, సచివాలయంలో ప్రొటెం స్పీకర్ ఎం.వి. కరుప్పయ్య సమక్షంలో శాసనసభ సభ్యునిగా ప్రమాణం చేశారు. విజయ్ అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న దృశ్యాలను చూసి ఆయన అభిమానులు, తమిళగ వెట్రి కజగం (TVK) కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. విజయ్ తో పాటు టీవీకే ఎమ్మెల్యేలు, డీఎంకే, అన్నాడీఎంకే ఇతర పార్టీల శాసనసభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తన మార్క్ పారదర్శకతను చాటుకున్నారు. గత డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి, ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయింది. దీనిపై సమగ్ర సమీక్ష నిర్వహించి, ప్రజల ముందు ‘శ్వేతపత్రాన్ని’ ఉంచుతాను. నా ప్రభుత్వం మూసి ఉన్న తలుపుల వెనుక కాదు.. బహిరంగంగా, పారదర్శకంగా పనిచేస్తుంది” అని విజయ్ స్పష్టం చేశారు.ప్రజలందరూ తనవారేనని విజయ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. “నన్ను అవమానించినా, విమర్శించినా సరే.. 8 కోట్ల మంది ప్రజలు నా ప్రజలే. ప్రజల సొమ్ములో ఒక్క పైసా కూడా ముట్టుకోను. విద్య, తాగునీరు, మెరుగైన రహదారులు, మహిళల భద్రత నా ప్రథమ ప్రాధాన్యతలు. నేను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాను, దానికి నాకు కొంత సమయం ఇవ్వండి” అని కోరారు.. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే విజయ్ తన తొలి నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న మాదకద్రవ్యాల నివారణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశించారు. మహిళల రక్షణ కోసం పటిష్టమైన భద్రతా చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర మిత్రపక్షాల మద్దతుతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అసెంబ్లీలో విజయ్ గొంతుక తమిళ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.