: నేపాల్‌లో ల్యాండింగ్ అయిన తర్వాత 278 మందితో వెళ్తున్న విమానం టైరుకు మంటలు, పొగలు వ్యాప్తి..!

సోమవారం తెల్లవారుజామున కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ అవుతుండగా దాని టైర్లకు మంటలు అంటుకున్నాయి. ప్రయాణీకులు, సిబ్బంది అందరినీ సురక్షితంగా తరలించినట్లు పోలీసులు ధృవీకరించారు.

ఇస్తాంబుల్ నుంచి కాఠ్మండు వెళ్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో కుడి వైపు టైర్లకు మంటలు అంటుకోవడంతో, ప్రయాణీకులందరినీ ఖాళీ చేయించి రక్షించారు.
“TK726 కాల్ సైన్ గల విమానం ఇస్తాంబుల్ నుంచి కాఠ్మండుకు వెళ్తుండగా, ల్యాండింగ్ సమయంలో టైరుకు మంటలు అంటుకున్నాయి. ఫైర్ ఇంజన్ ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చాము. ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించాము,” అని విమానాశ్రయ భద్రతా విభాగం ఎస్పీ రాజ్‌కుమార్ సిలవాల్ ఏఎన్ఐతో టెలిఫోన్ సంభాషణలో తెలిపారు.

అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఆ విమానంలో మొత్తం 278 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులలో కొందరు ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా ఉన్నారు.సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఒక వీడియోలో, విమానం యొక్క కుడి ల్యాండింగ్ గేర్‌పై మంటలు చెలరేగి, బూడిద రంగు పొగ దట్టంగా పైకి లేస్తున్నట్లు కనిపిస్తుంది. విమానంలోని ప్రయాణికులను అత్యవసర ద్వారాల ద్వారా సురక్షితంగా బయటకు తరలించారు.