వాటి ప్రయోగాలు కారణంగానే వాతావరణ కాలుష్యానికి కొత్త సమస్యలు..!

లండన్‌కు చెందిన కానర్ ఆర్. బార్కర్, ప్రొఫెసర్ ఎలోయిస్ ఎ. మరైస్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం 2020 నుంచి 2022 మధ్య రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహ అవశేషాలపై సమగ్ర పరిశోధన చేసింది. ఈ అధ్యయనం ప్రకారం రాకెట్ ప్రయోగాలు వాతావరణ కాలుష్యానికి కొత్త మూలంగా మారుతున్నాయి. ఇవి హానికరమైన రసాయనాలను నేరుగా ఎగువ వాతావరణ పొరల్లోకి విడుదల చేసి, ఇప్పటివరకు అత్యంత స్వచ్ఛంగా భావించిన సహజ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ కాలుష్యం సూర్యరశ్మిని కొంత మేర అడ్డుకుని స్వల్ప శీతలీకరణ ప్రభావం చూపుతున్నప్పటికీ, ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలతో పోలిస్తే ఇది చాలా తక్కువని పరిశోధకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఊహించని పర్యావరణ ప్రభావాలు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు. స్పేస్ ఎక్స్ సంస్థ నిర్వహిస్తున్న స్టార్‌లింక్ ప్రాజెక్ట్ వల్ల ఉపగ్రహాల సంఖ్య వేగంగా పెరుగుతోందని, ఇప్పటికే వేలాది ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని రాకెట్ ప్రయోగాలు జరగనున్నందున, పర్యావరణ పరిరక్షణ కోసం కఠిన నిబంధనలు అవసరమని శాస్త్రవేత్తలు సూచించారు.