బావ ఫోటో పెట్టుకున్నావ్?” అంటూ పూనమ్ రిప్లై పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కామెంట్‌..

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పుడూ సెన్సేషనే. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జనాభా పెంచాలని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పూనమ్.. నారా లోకేష్‌ను ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. దీనిపై ఓ నెటిజన్ కౌంటర్ ఇవ్వగా.. అతని ప్రొఫైల్‌లో డిస్‌ప్లే పిక్చర్ (DP) పవన్ కళ్యాణ్ ఫోటో ఉండటం చూసి “బావ ఫోటో పెట్టుకున్నావ్?” అంటూ పూనమ్ రిప్లై ఇచ్చారు. ఇది ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతోంది.చాలాకాలం క్రితమే సినిమా అవకాశాలకు దూరమైన నటి పూనమ్ కౌర్ .. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడూ ఏదొక విషయం మీద స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లను ఉద్దేశించి పోస్టులు పెడుతూ అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటారు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా, ఆమె బాధేంటో బయట పెట్టకుండా ఆమె పెట్టే ట్వీట్లు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు లేటెస్టుగా పూనమ్ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జనాభా పెరుగదలపై చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎక్కువమంది పిల్లల్ని కనాలని, రాష్ట్రంలో మూడో బిడ్డను కంటే రూ.30 వేలు, నాలుగో సంతానానికి రూ.40 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. డబ్బుల కోసం పిల్లల్ని కనమని చెప్పిన సీఎంపై విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కు ఒక్కరే సంతానం ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. పూనమ్ కౌర్ సైతం పరోక్షంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఘాటు వ్యాఖ్యలు చేశారు.’లోకేష్ తోనే మొదలుపెడదాం. ముందున్న ఆర్థిక అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని, లోకేష్ కి ఎక్కువమంది పిల్లలు ఉండాలని భావిద్దాం” అని పూనమ్ కౌర్ ట్వీట్ పెట్టారు. దీనికి నెటిజన్ స్పందిస్తూ ”నిజానికి తెలంగాణాలో ఉన్న లోకేష్ కి ఈ బెనిఫిట్స్ ఉండవుగా ఆంటీ” అని కామెంట్ పెట్టాడు. దానిపై పూనమ్ రియాక్ట్ అయింది. ”బావ ఫోటో పెట్టుకున్నావ్?” అని రిప్లై ఇచ్చింది. అతడి డీపీలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోవడం.. పూనమ్ ‘బావ’ అని సంబోధించడం చర్చనీయంశంగా మారింది.