హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటినా సుమారు 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురు..!

పలు చమురు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటి బయటకు వచ్చాయి. సుమారు 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో ప్రయాణిస్తున్న పలు ట్యాంకర్లు సురక్షితంగా జలసంధిని దాటినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ వర్గాలు వెల్లడించాయి..అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత హోర్ముజ్‌ ద్వారా ఈ స్థాయిలో రవాణా జరగడం ఇదే తొలిసారి అని సమాచారం (Strait of Hormuz oil tankers).

తాజాగా హోర్ముజ్‌ను దాటిన ట్యాంకర్లలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాలకు చెందిన చమురు ఉన్నట్లు సమాచారం. ఈ ట్యాంకర్లు ప్రధానంగా ఆసియా మార్కెట్లకు క్రూడాయిల్‌ను తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త రావడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 2.5 శాతం మేర తగ్గుదల నమోదు చేసింది (Crude oil shipment).

హోర్ముజ్ ట్రాఫిక్‌పై ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ తీసుకురావొచ్చని ఇటీవల ఇరాన్ సంకేతాలు ఇవ్వడంతో ఆయిల్ మార్కెట్లలో ఆందోళన పెరిగింది (Global oil supply). అయితే ప్రస్తుతం ట్యాంకర్లు సురక్షితంగా ప్రయాణించడం కొంతవరకు ఊరట కలిగిస్తోంది. ఇలా చమురు సరఫరాలు అంతరాయం లేకుండా కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.