తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల మహానాడు మహోత్సవం అత్యంత అద్భుతంగా, విజయవంతంగా ముగిసిందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మహానాడులో ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. యుద్ధ పరిస్థితుల వంటి క్లిష్ట కాలంలోనూ హైబ్రీడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ఊహించని రీతిలో రికార్డు విజయం సాధించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇదొక పెద్ద ప్రయోగమని చంద్రబాబు అభివర్ణించారు.
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న 48 డిగ్రీల తీవ్రస్థాయి ఎండలు, ఉష్ణోగ్రతలను కూడా లెక్కచేయకుండా కార్యకర్తలు ఈ మహానాడును విజయవంతం చేశారని చంద్రబాబు కొనియాడారు. “రికార్డులు సృష్టించడం, మళ్లీ వాటిని తిరగరాయడం ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం. ఈ మహానాడును గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు” అని చంద్రబాబు పేర్కొన్నారు.
“శాశ్వతంగా పార్టీని మోసింది, మోసేది, మోయబోయేది కార్యకర్తలే.. వారందరికీ నా పాదాభివందనం. పార్టీ కోసం, జెండా కోసం ఎందరో కార్యకర్తలు, నేతలు తమ ఆస్తులు అమ్ముకున్నారు. మెడపై కత్తి పెట్టినా భయపడకుండా ‘జై చంద్రబాబు.. జై తెలుగుదేశం’ అంటూ ప్రాణాలు వదిలిన కార్యకర్తల త్యాగాలు నాకు శిరోధార్యం” అని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నేతలు, కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి తానే వారితో పోటీ పడే పరిస్థితి వచ్చిందన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశామని, భవిష్యత్తులో వారి బిడ్డలకు నాణ్యమైన విద్య, సాధికారత, నైపుణ్యాభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి పెట్టామని చంద్రబాబు స్పష్టం చేశారు..