మల్కాజిగిరిలో భారీ తనిఖీలు.. 113 స్పా సెంటర్లపై దాడులు, 46 క్రిమినల్ కేసులు నమోదు..

మల్కాజిగిరిలో భారీ తనిఖీలు.. 113 స్పా సెంటర్లపై దాడులు, 46 క్రిమినల్ కేసులు నమోదు

హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ కార్యకలాపాలపై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 113 స్పా సెంటర్లను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన 46 స్పా సెంటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

పోలీసులు, ఎస్‌ఓటీ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అనేక స్పా సెంటర్లు అవసరమైన అనుమతులు, ఆమోదాలు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

కొన్ని కేంద్రాల్లో పారదర్శక గాజు తలుపులు లేకుండా రహస్య గదులు ఏర్పాటు చేయడం, కస్టమర్ల గుర్తింపు వివరాలు నమోదు చేయకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వంటి ఉల్లంఘనలు వెలుగుచూశాయి.

అలాగే అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బందికి థెరపిస్ట్ సర్టిఫికెట్లు లేవని, వారు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు.

అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలిన స్పా సెంటర్లను సీజ్ చేస్తామని, భవన యజమానులు తమ ప్రాంగణాల్లో జరుగుతున్న కార్యకలాపాలను తప్పనిసరిగా పర్యవేక్షించాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.