గాదె సాయికృష్ణ కేసులో అరెస్టయిన కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్‌ అధికారులు గంటల తరబడి విచారణ..!

గాదె సాయికృష్ణ కేసులో అరెస్టయిన కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్‌ అధికారులు గంటల తరబడి విచారించినప్పటికీ.. కీలక ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం..కేసులోని ప్రధాన అంశాలపై అడిగిన ప్రశ్నలకు మౌనం పాటించినట్లు తెలుస్తోంది. అయితే అదీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకేనా? అనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి.

విచారణ సందర్భంగా నాగరాజు చాలా ప్రశ్నలకు స్పందించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ కేసులో మరికొందరి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆయన నోరు విప్పడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. సిట్‌ దర్యాప్తులో భాగంగా ఉన్నతస్థాయి అధికారులు నేరుగా ప్రశ్నించినా నాగరాజు నుంచి ఆశించిన స్థాయిలో సమాచారం రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా సాయి కృష్ణ కస్టడీ, ఆచూకీ, సీసీటీవీ ఫుటేజీలకు సంబంధించిన ప్రశ్నల వద్ద ఆయన మౌనం మరింత అనుమానాలకు తావిస్తోంది.

ఎందుకు తీసుకొచ్చారు?
నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) అమలులో భాగంగా సాయి కృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చినట్లు రికార్డులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తీసుకొచ్చిన పోలీసు బృందం కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో నాగరాజుకు అప్పగించినట్లు ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. అతడిని కోర్టులో హాజరుపరిచారా? లేక స్టేషన్‌లోనే ఉంచారా? అన్న అంశంపై స్పష్టత రావడం లేదు. న్యాయ ప్రక్రియ ప్రకారం కోర్టులో హాజరుపర్చాల్సిన వ్యక్తి ఆ తర్వాత ఎలా అదృశ్యమయ్యాడన్నది దర్యాప్తులో కీలక అంశంగా మారింది. వారెంట్‌ అమలు పేరుతో అదుపులోకి తీసుకొచ్చిన సాయి కృష్ణను కోర్టుకు తీసుకెళ్లకుండా ఏం చేశారన్న ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లభించలేదు. ఇదే అంశంపై సిట్‌ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయి?
కేసులో అత్యంత కీలకంగా మారిన అంశం సీసీటీవీ ఫుటేజీలు. సాయికృష్ణ స్టేషన్‌లో ఉన్న సమయంలో నమోదైన ఫుటేజీలు ఎందుకు తొలగించబడ్డాయి? వాటిని ఎవరు డిలీట్‌ చేశారు? అనే ప్రశ్నలకు ఇంకా జవాబులు లభించలేదు. ఈ అంశంపై నాగరాజును సిట్‌ అధికారులు పదేపదే ప్రశ్నించినట్లు సమాచారం.

లాకప్‌లో కొట్టారా?
సాయికృష్ణను స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. లాకప్‌లో జరిగిన దాడుల వల్లే అతడు మరణించాడా? అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే దీనిపై నాగరాజు ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఒకవేళ సాయి కృష్ణ మరణించి ఉంటే.. మృతదేహం ఏమైంది? దానిని ఎక్కడికి తరలించారు? ఏమైనా రికార్డులు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు కేసులో అత్యంత కీలకంగా మారాయి. శ్మశానవాటికలో జరిగిన విచారణ కూడా ఇదే కోణంలో కొనసాగింది.

సమాచారం ఎవరికిచ్చారు?
కస్టడీలో ఉన్న వ్యక్తికి ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదం జరిగినా ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సాయి కృష్ణ మరణించి ఉంటే ఆ విషయాన్ని అప్పటి ఉన్నతాధికారులకు తెలియజేశారా? లేదా? అన్న అంశంపైనా సిట్‌ సమాధానాలు వెతుకుతోంది.

ప్రశ్నలే ఎక్కువ..!.

నాగరాజు అరెస్టు తర్వాత కేసు వేగం పుంజుకున్నప్పటికీ.. ఇప్పటివరకు సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాయి కృష్ణ నిజంగా ఏమయ్యాడు? కస్టడీలో ఏం జరిగింది? సీసీటీవీ ఫుటేజీలు ఎందుకు మాయమయ్యాయి? అన్న ప్రశ్నలకు దర్యాప్తు తుది సమాధానం చెబుతుందా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.