తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
మరో రూ.2 వేల కోట్ల బకాయిలు విడుదల.
సీఎం రేవంత్, భట్టి ఆదేశాలతో బకాయి నిధులు విడుదల.
గత నెల 29న మొదటి విడతలో రూ.2 వేల కోట్లు విడుదల..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బకాయిల (Employee Dues) చెల్లింపుల కోసం ప్రభుత్వం సోమవారం మరో రూ. 2,000 కోట్ల నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి (ఆర్థిక శాఖ మంత్రి) మల్లు భట్టి విక్రమార్క సంయుక్తంగా జరిపిన సమీక్ష అనంతరం, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిధుల విడుదలకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు…
ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు, వారి న్యాయమైన డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిధులను విడతల వారీగా అన్లాక్ చేస్తోంది. ఇందులో భాగంగానే గత నెల 29న మొదటి విడత కింద రూ.2,000 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు మరో రూ. 2,000 కోట్లు విడుదల చేయడంతో.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 4,000 కోట్ల మేర ఉద్యోగుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం చెల్లించినట్లయింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పీఎఫ్, జీపీఎఫ్, సరెండర్ లీవ్లు, మెడికల్ బిల్లులతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ నిధుల చెల్లింపులకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఈ ఆర్థిక ప్యాకేజీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, కేవలం నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 4,000 కోట్ల బకాయిలను విడతల వారీగా విడుదల చేసింది. ఇందులో భాగంగా గత నెల 29న మొదటి విడత కింద రూ. 2,000 కోట్లు, తాజాగా మరో రూ. 2,000 కోట్లను ప్రభుత్వం క్లియర్ చేసింది.తాజా నిధుల విడుదలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరియు పెన్షనర్లకు సంబంధించిన పలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కానున్నాయి..!