ముంబై, పుణె నగరాల్లో భారీ వర్షాలు బీభత్సం..

మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి..
గత వారం నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇక ఆర్థిక రాజధాని ముంబై జలదిగ్బంధం అయింది. ఇక పుణెలో కొండచరియలు విరిగి ఇల్లు మట్టిలో కలిసిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇంకోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి..ముంబై, పుణె నగరాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని, అప్రమత్తంగా ఉండాలని సీఎం పౌరులను కోరారు. వివిధ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడడం, భవనాలు-ఇళ్లు కూలిపోవడం, రోడ్లు డ్యామేజ్ కావడం జరుగుతోంది. పుణె జిల్లాలోని పటాన్ గ్రామంలో సోమవారం వేకువ జామున కొండ చరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో దాదాపు ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ప్రమాద సమయంలో నిద్రలో ముగ్గురు కుటుంబసభ్యులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరో 30 నుంచి 35 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మూడు వేర్వేరు గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి…

జరుగుతున్న ఘటనల గురించి తెలియగానే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికి తీసినట్టు తెలిపారు. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోందని ఎన్డీఆర్ఎఫ్ అధికారి తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ వే, ముంబై-పుణె జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ మార్గాల్లో వాహనాలు ప్రయాణించవద్దని సూచన చేశారు. వర్షాల నేపథ్యంలో అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హెచ్చరిక జారీ చేశారు. రాయ్‌గఢ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం సమయంలో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది..

రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, కర్జాత్‌-లోనావాల మధ్య ఠాకూర్‌వాడి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అలాగే ఖండాలా-మంకీ హిల్ మధ్య మరో చోట కూడా మట్టి, రాళ్లు పట్టాలపైకి చేరాయి. దీంతో ముంబయి-పుణె మార్గంలో నడిచే పలు ముఖ్యమైన రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. సుదూర రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించగా, కొన్ని రైళ్లను మధ్యలోనే నిలిపివేయడం లేదా సమయాలను మార్చారు. కొండచరియలు తొలగించి రైల్వే ట్రాక్‌లను పునరుద్ధరించే పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైళ్ల తాజా వివరాలను తెలుసుకుని బయలుదేరాలని సూచించారు. ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్స్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు…

లోనావాలా వద్ద భారీ ట్రాఫిక్ జామ్
భారీ వర్షాల కారణంగా ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలోని ‘మిస్సింగ్ లింక్’ మార్గంలో టన్నెల్-2 సమీపంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సోమవారం తెల్లవారుజామున నుంచి పుణె నుంచి ముంబయి వెళ్లే వాహనాలను లోనావాలా మీదుగా మళ్లించారు. దీంతో లోనావాలా నగరం గుండా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు పుణే-మంగావ్ జాతీయ రహదారి (పౌడ్-మంగావ్ మార్గం)పై అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే ముంబయి-పుణె మార్గంలో ప్రయాణించాలని వాహనదారులు, రైలు ప్రయాణికులకు అధికారులు సూచించారు. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతాయని వెల్లడించారు..