మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రస్తుతం 89,230 క్యూసెకుల ప్రవాహం ఉన్నదని, ఆ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు వాడుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజా నిజాలు- రేవంత్ చెప్పిన అబద్ధాలు’ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు వచ్చినా, కాలం కాకపోయినా ఎల్లప్పుడూ నీటి ప్రవాహం ఉండే ప్రాంతం మేడిగడ్డ అని, అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో బరాజ్ కట్టిందన్నారు. ఇప్పుడు కూడా బరాజ్ వద్ద ఏడు టీఎంసీల నీరు ప్రవహిస్తున్నదని, మూడు టీఎంసీలు ఎత్తిపోసుకున్నా, మరో నాలుగు టీఎంసీలు దిగువకు వెళ్తాయన్నారు. మరోవైపు సమ్మక్క బరాజ్‌లో లక్షా 8వేల క్యూసెక్కుల వరద ఉన్నదని, దేవాదుల ప్రాజెక్టు మూడు ఫేజ్‌లు కలిపి రోజుకు 2,542 క్యూసెక్కులు ఎత్తిపోయవచ్చని తెలిపారు. ప్రభుత్వం మాత్రం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తిపోయడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో వరద నీళ్లు ఉండి కూడా ఎత్తిపోయకపోవడం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిల క్రిమినల్ నెగ్లిజెన్సీ అని ధ్వజమెత్తారు. అబద్దాలకు నోబెల్ బహుమతి ఇస్తే అది రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ వద్ద రబ్బరు డ్యామ్ నిర్మించి నీళ్లను వాడుకోవచ్చని నిపుణులైన ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ వద్ద 89,230 క్యూసెక్కుల ప్రవాహం
‘పోయిన రెండేండ్లు కాలం మంచిగైంది కాబట్టి నీకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు బాలేదు కాబట్టి నీళ్లు ఇవ్వుమంటే కథలు చెప్తున్నావ్. నిన్నటిదాకా కూలిపోయిందన్న ప్రాజెక్టుకు ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే నీ మోసం ప్రజలకు అర్థమవుతుందని పంతాలు, పట్టింపులకు పోయి మోటార్లు ఆన్ చేయకుండా డ్రామాలు నడుపుతున్నావ్’ అని హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరువు వచ్చినా, కాలం కాకపోయినా ఎల్లప్పుడు నీటి ప్రవాహం ఉండే ప్రాంతం మేడిగడ్డ అని, అందుకే ఆ ప్రాంతంలో బరాజ్ కట్టామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వానలు లేకపోయినా ఇప్పడు కూడా మేడిగడ్డ దగ్గర 89,230 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నదని, ఏడు టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పారు. మూడు టీఎంసీలు ఎత్తిపోసినా ఇంకా నాలుగు టీఎంసీల నీళ్లు దిగువకు వెళ్తాయన్నారు. ఈ సందర్భంగా గోదావరి ప్రవాహ ఆన్లైన్ డేటా బేస్‌ను ప్రదర్శించారు. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అధికారిక డేటా అని చెప్పారు. దీనినిబట్టి రెండుమూడు రోజుల కిందట లక్ష క్యుసెక్కులకుపైగా ప్రవాహం ఉన్నదని గణాంకాలు చెప్తున్నాయన్నారు. ‘అక్కడ నీటి ప్రవాహం ఉన్నది కాబట్టే మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ఆన్‌చేసి మూడు టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఇప్పటికీ ఉన్నదని, ఎందుకు ఆ పనిచేయడం లేదని హరీశ్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు పేరొస్తదనే చిల్లర రాజకీయాలతో నీళ్లను కిందకి జారవిడిస్తూ రైతులకు, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ‘మోటార్లు ఆన్‌చేసి ఆ నీళ్లు ఎత్తిపోస్తవా? పోయ వా? అది నీ విజ్ఞత? నీకు రైతు ప్రయోజనాలు ముఖ్యమా? రాజకీయాలు ముఖ్యమా? నువ్వే డిసైడ్ చెయ్యి రేవంత్‌రెడ్డి?’ అని సూచించారు. వొడిసిపడుతావో.. విడిచిపెడుతావో నిర్ణ యం తీసుకోవాలన్నారు. ‘వొడిసిపడుతలేవుగానీ.. చంద్రబాబు కోసం విడిచిపెడుతున్నావు’ అంటూ సీఎంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.