ఇరాన్- అమెరికా మధ్య తాజాగా కాల్పుల విరమణ ముగిసిన వెంటనే పరస్పరం తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్నాయి..ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయికి చేరింది. ఇరాన్ లోని కీలకమైన బందర్ అబ్బాస్, సిరిఖ్, ఖేశ్మ్, జాస్క్ తదితర ప్రాంతాల్లో అమెరికా సైన్యం పేలుళ్లు జరిపింది. అటు బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్ దేశాల్లోని అమెరికన్ మిలిటరీ స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
ఇరాన్- అమెరికా యుద్ధంలోకి ఇప్పుడు రష్యా కూడా వచ్చింది. ఈ మేరకు ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోకి రష్యా తన అధునాతన టీయూ-214పీయూ కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్ ను పంపించినట్లు స్పష్టం అవుతోంది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా అందించిన వివరాల ప్రకారం ఇరాన్- అమెరికా మధ్య హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు అధికం అవుతున్న క్రమంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ టెహ్రాన్ కు చేరుకున్నట్లు వివరించింది. దాంతో రష్యా వ్యూహాత్మకంగా ఇరాన్ కు సపోర్ట్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇరాన్‌కు మద్దతుగా రష్యా నేరుగా రంగంలోకి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం (జూలై 13, 2026) నాడు వెలుగులోకి వచ్చిన లైవ్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా కలకలం సృష్టిస్తోంది. మాస్కోకు చెందిన అత్యంత రహస్యమైన, అత్యాధునిక ‘Tu-214PU’ వైమానిక కమాండ్ పోస్ట్ విమానం నేరుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి వర్సెస్ ఇరాన్ మధ్య దాడులు-ప్రతీకార దాడులతో అట్టుడుకుతున్న వేళ.. రష్యా తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం “ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కాబోతోందా?” అనే భయాందోళనలను రేకెత్తిస్తోంది..
గల్ఫ్ ఉద్రిక్తతల నడుమ రష్యా ఎంట్రీ!
గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయగా.. ప్రతిస్పందనగా అమెరికా కూడా ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు ముమ్మరం చేసింది. గత జూన్ నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గకపోగా మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇలాంటి కీలక తరుణంలో రష్యా తన అత్యున్నత సైనిక కమాండ్-కంట్రోల్ విమానాన్ని టెహ్రాన్‌కు పంపడం అమెరికా మరియు గల్ఫ్‌లోని దాని మిత్రదేశాలకు బలమైన హెచ్చరికగా భావించవచ్చు.
ఇరాన్‌కు రష్యా కేవలం దౌత్యపరమైన మద్దతు మాత్రమే కాకుండా.. అవసరమైతే గగనతలం నుండే ఉన్నత స్థాయి యుద్ధ సమన్వయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇచ్చింది. ఈ విమానం రాకతో ఇరాన్‌కు రష్యా నుంచి అత్యంత కీలకమైన శాటిలైట్ గూఢచార సమాచారం, సైనిక వ్యూహాల బదిలీ, ఉమ్మడి అత్యవసర రక్షణ ప్రణాళికలు అందనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా, ఇరాన్‌ల ఈ ఉమ్మడి వ్యూహం పశ్చిమ ఆసియాను మరింత వినాశకరమైన యుద్ధంలోకి నెట్టేలా కనిపిస్తోంది.