*సూర్యాపేట జిల్లా …..*
నేరేడుచర్ల మండల కేంద్రం హుజూర్నగర్లో బీఆర్ఎస్ సమన్వయకర్త ఒట్టెద్దు నరసింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో రైతులకు స్వర్ణయుగం వచ్చిందని, ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రతిష్టలకు పోకుండా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే నీటి విడుదలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, రెండున్నరేళ్ల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలకు జవాబు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.
కన్నెపల్లి నుంచి సుందిళ్లకు నీటిని ఎత్తిపోసే అవకాశం ప్రస్తుతం కూడా ఉందని, ఎన్డీఎస్ (NDS) పేరుతో సాకులు చెప్పడం సరైంది కాదన్నారు. సంబంధిత ఇంజినీర్లు ప్రాజెక్టు సిద్ధంగా ఉందని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకపోవడం వల్లే నీటి సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు.
గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, సాగునీరు, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి రైతాంగ ప్రయోజనాల దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ఒట్టెద్దు నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమంలో నేరేడు చర్ల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అప్పిరెడ్డి, సురేష్ బాబు, సైదులు, జయ బాబు.. పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..