అద్భుతాల ధామం – పురీ జగన్నాథం..!

*అద్భుతాల ధామం – పురీ జగన్నాథం*

*ఆధ్యాత్మిక చైతన్యానికీ, భక్తి ఉద్యమానికీ ప్రధాన కేంద్రం పురీ జగన్నాథ క్షేత్రం. ఒరిస్సా రాష్ట్రంలోని ఈ పురుషోత్తమ క్షేత్రం అనాదిగా ఎన్నో ప్రత్యేక విశిష్టతలు కలబోసుకొని ప్రపంచాకర్షణని సాధించింది. కృష్ణభక్తి ఉద్యమకర్త చైతన్య మహాప్రభువు సేవించి తరించి ముక్తి పొందిన పవిత్ర ధామమిది.*

*ఆదిశంకరులు దర్శించి పరవశించి, తన నాలుగు పీఠాల్లో ఒకదాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారు. విశిష్టమైన ఉత్కళ కళలకీ, జీవనరీతికీ ఆధారంగా ఉన్న దైవం పురీ. జగన్నాథుడు. యుగయుగాలుగా విభిన్నరీతుల్లో విష్ణువు పూజలందుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.*

*కృతయుగాది నుండి నీలమాధవునిగా, నీలాచలంలో వెలసి దేవ, ఋషులచే సేవించబడి; జగన్నాథ, బలభద్ర, సుభద్రా మూర్తులుగా దారువిగ్రహాలతో ఆవిర్భవించి “దారుబ్రహ్మము”గా సంభావించ బడుతున్నాడు నారాయణుడు.*

*జగన్నాథ ప్రసాదం*

*”కాశీగంగ, బృం* *దావన మృత్తిక, జగన్నాథ ప్రసాదం- ఈ మూడూ సాక్షాత్తు గోవిందరూపాలు” అని శ్రీరామకృష్ణ పరమహంస పలికేవారు.*

*ఇది శాస్త్ర వచనం కూడా. అందుకే పురీ ప్రసాదానికి ప్రత్యేకత ఉంది. మహాలక్ష్మి అధ్యక్షతన వండబడే దివ్య ప్రసాదమిది- అని ధార్మిక గ్రంథాల మాట.*

*ఈ ప్రసాదాన్ని జాతిభేదాలు లేకుండా ప్రతివారూ స్వీకరిస్తారు. ఇది మహిమాన్వితమే కాక, దీనితో పితృశ్రాద్ధాదికాలూ ఆచరించి ధన్యత పొంద వచ్చునని పురాణ వచనం. ఈ ప్రసాదమహిమను ఆధారం చేసుకొని ఎన్నో పౌరాణిక, చారిత్రక గాథలున్నాయి.*

*ఎటువంటి భేదభావాలు లేకుండా ఎవరి చేతినుండైనా గ్రహించదగిన ఈ ప్రసాద మహిమ బహువిధాలుగా వర్ణించారు.*

*నివేదన వరకు ఖచ్చితమైన నియమాలను పాటించి, నివేదనానంతరం జగన్నాథునికి మారు రూపంగా భావించబడి, అందరినీ అనుగ్రహించే ప్రసాదమిది.*

*ఏ క్షేత్రంలోనూ లేని ప్రత్యేకత ఇక్కడి అన్నప్రసాదానికి ఉంది.*

*”ఇందులో ప్రతి మెతుకూ గోవిందుడే” అన్నారు పరమహంస.*

*సర్వం శ్రీ జగన్నాథం…*

*ఈ నానుడి ప్రసిద్ధం. విభేదాలకీ, తారతమ్యాలకీ తావీయకూడని నియమం ఉన్న ఈ పావనభూమి ఎన్నో ఆలయాలతో, తీర్థాలతో విరాజిల్లుతోంది. ‘కేవలం జగన్నాథ స్మరణతో అన్నీ పవిత్రమవుతాయి’ అనే సద్భావన ఇక్కడి సత్సంప్రదాయాలకు ప్రాణం పోస్తోంది. రథయాత్ర సమయంలో లక్షలాది జనవాహిని సమక్షంలో రాజు సైతం చీపురుతో రథాన్ని శుభ్ర పరచడం-‘భగవంతుని ముందు రాజైనా సేవకుడే’ అనే భావాన్ని ప్రకటిస్తుంది. విశ్వరథాన్ని నడిపే పరమాత్ముని దర్శించడానికి ప్రతీకగా జరిగే రథోత్సవం ఒక మహద్విశేషం. ‘నందిఘోష’ రథంపై జగన్నాథుడు, ‘తాళధ్వజ’ రథాన బలభద్రుడు, ‘దర్పదళన’మనే రథంలో సుభద్రాదేవి విశాలరాజ మార్గాన దివ్యశోభలతో సాగుతూ జన సముద్రాన్ని కృపాసముద్రంలో ముంచెత్తుతారు.*

*పండిత లోకానికే కాక, పామర జనానికి కూడా హృదయంగమమైన మహిమ జగన్నాథునిది. ఆటవికులు, అతి సామాన్యులు స్వామి అనుగ్రహాన్ని పొందిన వైనాలు ఈ క్షేత్ర చరిత్రలో కోకొల్లలు.*

*శిల్ప, చిత్ర, సంగీత, నృత్య, సాహిత్య రీతులెన్నో ఈ క్షేత్రాన్ని ప్రధానం చేసుకొని విలసిల్లాయి. ఎన్నో వృత్తులవారు అధిక సంఖ్యలో ఈ ఆలయాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు.*

*రథంలో విశ్వచైతన్యం*

*’చలన ధర్మం కలది’ కనుక రథం. ఈ అర్థం అటు జగతికీ, ఇటు శరీరానికీ అన్వయిస్తుంది. ‘కదిలేది’ ఒకటున్నదీ అంటే, ‘కదిలించేది’ మరి ఒకటున్నదని స్పష్టం. ఆ కదిలించే విశ్వచైతన్యమే విష్ణువు.*

*జగతి రథాన్ని కదిలించే జగన్నాథుని దర్శించడమే ఈ యాత్రలోని ఆంతర్యం. రథానికున్న అశ్వ శిల్పాలు, ధ్వజాలు, అలంకారాలు… అన్నీ శాస్త్రబద్ధంగా మలచడమే కాకుండా, ఆగమశాస్త్రాల ప్రకారంగా విశ్వాన్ని నడిపే బహుదేవతాశక్తులు, మంత్ర మూర్తులు వీటిలో ఉన్నారని ప్రమాణ వాక్యాలున్నాయి.*

*కాశీతో పోలిక*

*కాశీ విశ్వనాథునికి, పురీ జగన్నాథునికీ కొన్ని సాదృశ్యాలున్నాయి. ఎన్ని యుగాలైనా శాశ్వతమైన క్షేత్రాలు ఇవి… అని పురాణాలు చెబుతున్నాయి. విశ్వానికి నాథునిగా శివుడు, జగతికి నాథునిగా విష్ణువు! ఈ నామాల సాదృశ్యమే ‘శివాయ విష్ణురూపాయ’ అనే తత్త్వాన్ని చాటుతోంది.*

*ఒకే పరమేశ్వర చైతన్యం కాశీలో విశ్వనాథుడు, పురీలో జగన్నాథుడు. అక్కడ అన్నపూర్ణమ్మ ఏలుబడి, ఇక్కడ మహాలక్ష్మి అన్న ప్రసాదదాయినిగా అనుగ్రహం! అక్కడ గంగాతీరం- ఇక్కడ సముద్రతీరం. రెండూ ముక్తిక్షేత్రాలుగా పురాణాలలో వర్ణించారు.*

*ముమ్మూర్తుల ముచ్చట*

*“ఒకప్పుడు రాధాదేవిని కలిసిన రుక్మిణీ సత్యభామాదులు బృందావనంలోని బాలకృష్ణలీలలను చెప్పమని కోరారట. రాధారాణి ఆ లీలలను పరవశంతో వర్ణిస్తుంటే, తన్మయులై వింటున్నారు ద్వారకా రాణులు.*

*అదే సమయంలో ఆ భవనం వైపు చెల్లెలు సుభద్రతో, అన్న బలరామునితో అటు వస్తున్న వాసుదేవుడు ద్వారం వద్దనే నిలబడి రాధాప్రసంగాన్ని విన్నాడు. వింటూనే ఆ ముగ్గురూ తాదాత్మ్యంతో శిల్పాలవలే నిలబడ్డారు.*

*ఆ దృశ్యాన్ని చూసిన నారదుడు ఈ ముగ్గురు మూర్తులు నిరంతరం భక్తులను అనుగ్రహించేలా ఆరాధ్యదేవతలై కలకాలం ఉండాలని కోరాడట. ఆ ముచ్చట తీర్చడానికై స్వామి అవతారానంతరం ఈ క్షేత్రాన వెలశాడని ఒక పురాణోక్తి.*

*ఎన్నో విధాలుగా పురాణాలు బోలెడు కథలు చెప్పినా, వాటన్నింటి సారంగా ఉన్న సమన్వయ సూత్రం ఒక్కటే.*

“పరిపూర్ణుడైన వాసుదేవ బ్రహ్మం జగన్నాథుడు. విష్ణ్వంశరూపుడు సంకర్షణుడు బలభద్రుడు. వైష్ణవీమాయాశక్తి సుభద్ర. వీరితోపాటు జ్ఞానజ్వాలామూర్తిగా ఉన్న సుదర్శనుడు”.

ఈ నాలుగు రూపాలు నాలుగు వేదాలకు ప్రతీకలుగా ఉంటూ, జగతిని రక్షించే భగవన్మూర్తులుగా ఈ క్షేత్రంలో భాసిస్తున్నాయని మహర్షుల మాట.

భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ఒక ప్రముఖ క్షేత్రతీర్థస్థలం ఈ ప్రాచీన విష్ణుధామం.