చైనాలో గోల్డ్ మెడల్ సాధించిన ప్రవళికకు ఉపాధ్యాయుల ఆర్థిక చేయూత..
ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన గుండ్లపల్లి అమ్మాయి..
తల్లిదండ్రులు, శిక్షకులకు ఘన సత్కారం..
డిండి…..
చైనాలోని ఓర్డోస్ నగరంలో ఇటీవల జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2026లో భారత మహిళల 4×400 మీటర్ల రిలే జట్టులో పాల్గొని స్వర్ణ పతకం (గోల్డ్ మెడల్) సాధించిన నల్గొండ జిల్లా, డిండి మండలం గుండ్లపల్లికి చెందిన నారిమళ్ల ప్రవళికకు స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్పీఆర్పీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన అభినందన సభలో మండల పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రవళిక క్రీడా, విద్య అవసరాల కోసం తమ ఉదారతతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సాధారణ మేస్త్రీ కుటుంబానికి చెందిన ప్రవళిక అంతర్జాతీయ వేదికపై భారతదేశంతో పాటు మన తెలంగాణ రాష్ట్ర కీర్తిని చాటడం ఎంతో గర్వకారణమని ఉపాధ్యాయులు కొనియాడారు.
పేదరికం అడ్డంకి కాదు
ఈ సందర్భంగా తాజా మాజీ ఎంఈఓ, జెడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లి జీహెచ్ఎం ఇస్లావత్ గోప్య నాయక్, తవక్లాపూర్ ఎంపీపీఎస్ హెడ్మాస్టర్ డి. రాజేందర్ రెడ్డి, ఎస్జీటీ టీచర్ ముద్దాడ బాలరాజు మాట్లాడుతూ…విద్యార్థులు ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. పేదరికం దేనికీ అడ్డంకి కాదని, ఆ భావనను పూర్తిగా దూరం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా ‘సింహం – కుందేలు’ కథను ఉదహరిస్తూ, పట్టుదల ఉంటే ఎంతటి మహానగర విద్యార్థులకైనా గ్రామీణ విద్యార్థులు పోటీ ఇవ్వవచ్చని వివరించారు.
కోచ్, తల్లిదండ్రులకు సత్కారం
అంతర్జాతీయ విజేతగా నిలిచిన ప్రవళిక తల్లిదండ్రులు రాంబాబు-విజయ దంపతులను ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే ఈ విజయానికి సహకరించిన కోచ్ పరుశురాం, పీఈటీ జ్యోతి, ఇంచార్జ్ వైస్ ప్రిన్సిపాల్ నాగమణి, ఉపాధ్యాయురాలు మంగలను కూడా శాలువాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు లింగిరి సత్యనారాయణ, పల్లె వెంకటయ్య, ఎస్టీయూటీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భూక్య నాగేశ్వరరావు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గొడుగు శ్రీనివాస్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.