ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు.. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను: ఆమని.

ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు.. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను: ఆమని
ప్రముఖ నటి ఆమని తన సినీ జీవితం, వ్యక్తిగత అనుభవాలపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం సినిమాల్లో తల్లి పాత్రలకు పరిమిత అవకాశాలు ఉండటంతో సీరియల్స్‌లో మంచి పాత్రలు లభిస్తున్నాయని, అందుకే వాటిపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఇటీవల తాను నటించిన ఓ సీరియల్ తన కెరీర్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పారు.
తన సినీ ప్రయాణంలో మహేష్ బాబు బాల్యంలోనే ఆయనకు తల్లి పాత్ర పోషించానని, అలాగే నాని, అఖిల్‌లకు కూడా తల్లి పాత్రల్లో నటించినట్లు ఆమని తెలిపారు. అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని, మహేష్ బాబు చాలా అందంగా ఉంటారని, జూనియర్ ఎన్టీఆర్ నటన, నృత్యం అద్భుతమని ప్రశంసించారు. హ్యాపీ జర్నీ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని పేర్కొన్నారు.
జగపతి బాబుతో తన కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించేదని ఆమని తెలిపారు. తమిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలామంది సూచించేవారని గుర్తు చేసుకున్నారు. అయితే అప్పట్లో తన దృష్టంతా నటనపైనే ఉండేదని, ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేదా క్రష్‌లు లేవని స్పష్టం చేశారు. ఒక తమిళ వ్యక్తి నుంచి వివాహ ప్రతిపాదన వచ్చినప్పటికీ కుటుంబ బాధ్యతలు, కెరీర్ లక్ష్యాల కారణంగా దానిని తిరస్కరించినట్లు వెల్లడించారు.
తన సినీ జీవితంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని, కోరుకున్న గుర్తింపు లభించిందని ఆమని తెలిపారు. తనకు సినీ జీవితంలో కొత్త దారి చూపింది దర్శకుడు ఈ.వి.వి. సత్యనారాయణేనని చెప్పారు. ‘ఆమని’ అనే పేరును కూడా ఆయనే పెట్టారని, లేకపోతే తాను తెలుగు సినీ పరిశ్రమలో ఈ స్థాయికి వచ్చేదానిని కాదని అన్నారు.

తన అసలు పేరు మంజు అని, మొదట మీనా, తర్వాత మీనాక్షి అని పేరు మార్చినా, చివరకు ఈ.వి.వి. సత్యనారాయణ పెట్టిన ‘ఆమని’ పేరే స్థిరపడిందని తెలిపారు. ప్రస్తుతం తన ఆధార్, పాస్‌పోర్ట్ సహా అన్ని అధికారిక పత్రాల్లో కూడా ‘ఆమని’ పేరే ఉందని చెప్పారు. ఇక తాను నటించిన ‘హ్యాపీ జర్నీ’ సహా పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఆమని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.