కర్ణాటకలో యువతలో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు.. అప్రమత్తమైన ప్రభుత్వం…

కర్ణాటకలో యువతలో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు.. అప్రమత్తమైన ప్రభుత్వం
కర్ణాటక రాష్ట్రంలో యువతలో హెచ్‌ఐవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7 వేల మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ సోకినట్లు గుర్తించడంతో నివారణ చర్యలను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది.
రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం ప్రత్యేక ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో హెచ్‌ఐవీ పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ శిబిరాలను నిర్వహించాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ శిబిరాలను రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో తప్పనిసరిగా నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) నివేదిక ప్రకారం దేశంలో హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారి సంఖ్యలో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మంది హెచ్‌ఐవీతో జీవిస్తుండగా, వారిలో 2.05 లక్షల మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మరో 54 వేల మందికి తమకు హెచ్‌ఐవీ సోకిన విషయం తెలియకపోవడం వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స, యువతలో అవగాహన పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లో ప్రత్యేక పరీక్షలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలను చేపట్టనుంది. అధికారులు విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.