అనాథాశ్రమం వీడియోతో తప్పిపోయిన కుమారుడి ఆచూకీ
హైదరాబాద్, జూలై 30: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో 17 రోజులుగా తప్పిపోయిన మానసిక వికలాంగ యువకుడిని తల్లిదండ్రులకు చేరువ చేసింది. అనాథాశ్రమంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల వీడియోను చూసి తమ కుమారుడిని గుర్తించిన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.
పటాన్చెరుకు చెందిన మంజుల, మల్లేష్ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు మహేష్ మానసిక వికలాంగుడు. 17 రోజుల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన మహేష్ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సికింద్రాబాద్ బన్సీలాల్పేట్లోని హోమ్ ఫర్ డిసేబుల్డ్ అనాథాశ్రమం సిబ్బంది మహేష్ను గుర్తించి ఆశ్రయం కల్పించారు.
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అందులో ఉన్న మహేష్ను చూసిన అతని తల్లిదండ్రులు వెంటనే గుర్తించారు.
వెంటనే అనాథాశ్రమాన్ని సంప్రదించిన మంజుల, మల్లేష్ అక్కడికి చేరుకుని తమ కుమారుడిని అక్కున చేర్చుకున్నారు. 17 రోజుల తర్వాత కుమారుడు క్షేమంగా దొరకడంతో కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక సోషల్ మీడియా వీడియో తప్పిపోయిన కుమారుడిని తల్లిదండ్రులకు చేరువ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.