జార్ఖండ్ విద్యార్థి ఉద్యమం సోమవారం హింసాత్మకంగా మారి రక్తపాతాన్ని సృష్టించింది. ఆందోళనకారులు ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపుమేరకు వేలాది మంది విద్యార్థులు, ఆశావహులు తరలిరావడంతో వారిని అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారు. జార్ఖండ్ అసెంబ్లీ ప్రాంగణం వైపు దూసుకెళ్లిన నిరసనకారులపై పోలీసులు లాఠీలు ఝలిపించారు. వాటర్ కెనన్లు, బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసు లాఠీచార్జ్జీలో పలువురు విద్యార్థుల తలలు పగిలి తీవ్రంగా గాయపడ్డారు. బారికేడ్లను ఛేదించుకుని అసెంబ్లీ వద్దకు చేరుకోవడానికి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును, జల ఫిరంగులను ప్రయగించారు. త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులు చేతబూనిన నిరసనకారులు వాటర్ కెనన్లను పోలీసులు ప్రయోగించిన సమయంలో నృత్యం చేయడం ప్రారంభించారు. కొత్త అసెంబ్లీ భవనానికి దారితీసే జగన్నాథ్పూర్ ఆలయ రోడ్డు సమీపానికి చేరుకున్న తమపై పోలీసులు జరిపిన చర్యలో పలువురు గాయపడినట్లు నిరసనకారులు తెలిపారు…
భారీగా భద్రతా బలగాల మోహరింపు మధ్య ఒకదాని తర్వాత మరొక బారికేడ్ను దాటుకుంటూ నిరసనకారులు ముందుకు దూసుకెళ్లారు. ‘‘జేఎస్ఎస్సీసీజీఎల్ పరీక్షలను రద్దు చేయాలి లేదా సీబీఐ విచారణ జరిపించాలి’’, ‘‘జేఎస్ఎస్సీపై రెయిడ్ చేయడానికి సీఐడీ ఎందుకు పారిపోతోంది?’’, ‘‘నిష్పక్షపాత విచారణ జరిపించాలి, నిజం బయటపెట్టాలి’’ అని రాసి ఉన్న ప్లకార్డులను, త్రివర్ణ పతాకాలను పట్టుకుని వేలాదిమంది యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీ జగన్నాథ్ పూర్ ఆలయానికి చేరుకోగానే పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించడంతో, ఆందోళనకారులు త్రివర్ణ పతాకాలను ఊపుతూ నృత్యం చేశారు. కొద్దిసేపటికి వారంతా ముందుకు సాగడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీచార్జీ చేశారు. చివరకు నిరసనకారులు అసెంబ్లీకి సుమారు 200 మీటర్ల దూరం వరకూ దూసుకెళ్లారు. దీంతో వారిపైకి పోలీసులు అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.