బజార్ హమాలీ రేట్లు పెంచాలని డిమాండ్.. వర్తక సంఘానికి నోటీసు.
17నుంచి లారీలు ఎగుమతులు బంద్ చేస్తామని హెచ్చరిక.
హుజూర్నగర్: బజార్ హమాలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బజార్ హమాలీ కార్మిక సంఘం వర్తక సంఘానికి రెండో నోటీసు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం BRTU (TRSKV) నియోజకవర్గ కార్మిక సంఘాల అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ అధ్యక్షతన వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు నోటీసు అందజేశారు.
హమాలీ రేట్లు పెంచాలని కోరుతూ గతంలో 14-02-2026న వర్తక సంఘం కమిటీకి మొదటి నోటీసు ఇచ్చినట్లు కార్మిక సంఘం నాయకులు తెలిపారు. నోటీసుపై స్పందించి చర్చలకు పిలుస్తారని ఎదురుచూసినా ఇప్పటివరకు చర్చలకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు..
ఈ నేపథ్యంలో మంగళవారం రెండో నోటీసు ఇచ్చామని, ఆగస్టు 16, 2026 ఆదివారం లోపు చర్చలకు పిలిచి హమాలీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆగస్టు 17, 2026 సోమవారం నుంచి వర్తక సంఘానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ లారీల ఎగుమతులను బంద్ చేస్తామని హెచ్చరించారు.
ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత వర్తక సంఘానిదేనని బజార్ హమాలీ సంఘం నాయకులు స్పష్టం చేశారు. నోటీసు ద్వారా, పత్రికా ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వర్తక సంఘం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బజార్ హమాలీ సంఘం అధ్యక్షుడు గొట్టే సైదులు, BRTU పట్టణ కార్యదర్శి ముసంగి శీను, కోశాధికారి పులి నరసింహ, ప్రధాన కార్యదర్శి ములకలపల్లి సురేష్, ఉపాధ్యక్షుడు పంగ బాలకృష్ణ, మాజీ అధ్యక్షుడు భాస్కర్తో పాటు మేస్త్రీలు ధనుంజయ, వెంకన్న, ఇంటి రామయ్య, కోటేశ్వరరావు తదితర హమాలీ కార్మికులు పాల్గొన్నారు.