ఇరుముడి’ సక్సెస్‌ మీట్లో శివ నువ్వు తోపు సామీ అంటూ రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇరుముడి’ సక్సెస్‌పై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు
irumudi-success-ravi-teja-hugs-shiva-nirvana.
హైదరాబాద్: ‘ఇరుముడి’ సినిమా విజయోత్సవ వేడుకలో హీరో రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు శివపై తనకున్న నమ్మకాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, సినిమా కోసం చేసిన కృషిని రవితేజ కొనియాడారు.

సినిమాలో భార్గవ్, కిషోర్, కొమరం తదితరులు అద్భుతంగా నటించారని అన్నారు. ఇలాంటి నటులతో ప్రత్యేకమైన పాత్రలు చేయించడం దర్శకుడు శివ కాన్ఫిడెన్స్‌, కన్విక్షన్‌కు నిదర్శనమని ప్రశంసించారు. రమేష్ ఇంద్ర, శ్వాసిక, అజయ్ ఘోష్, ప్రణీత తదితరులు తమ పాత్రల్లో మెప్పించారని తెలిపారు. ముఖ్యంగా శ్వాసిక అద్భుతంగా నటించిందంటూ సరదాగా ప్రశంసలు కురిపించారు. సామ్‌ సహా యువ నటీనటులకు మంచి భవిష్యత్‌ ఉందని ఆకాంక్షించారు.

సాంకేతిక నిపుణులను కూడా రవితేజ అభినందించారు. సినిమాటోగ్రాఫర్ విష్ణు అద్భుతమైన విజువల్స్ అందించారని చెప్పారు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ మధ్య మంచి అనుబంధం ఉంటే సినిమా మరింత బాగా వస్తుందని, విష్ణుతో మరోసారి కలిసి పనిచేయాలని ఉందన్నారు. ఆయన పాజిటివ్‌ నేచర్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.

సినిమా బృందానికి అన్నీ దగ్గరుండి చూసుకున్న దినేష్‌ను కూడా రవితేజ అభినందించారు. మొదటి షెడ్యూల్‌లో కొంత ఇబ్బంది పడినా.. ఆ తర్వాత పరిస్థితులకు అలవాటు పడి అద్భుతంగా పనిచేశారని అన్నారు. డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్లు బాబా భాస్కర్‌, శేఖర్‌కు థ్యాంక్స్‌ చెప్పారు.

ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌లతో తాను ఎన్నో సినిమాలు చేశానని, దాదాపు తన సినిమాల్లో 80 శాతం వరకు వారే పనిచేశారని రవితేజ గుర్తుచేసుకున్నారు. ‘ఇరుముడి’ క్లైమాక్స్‌లో యాక్షన్‌ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఫైట్‌ మాస్టర్‌ సతీష్‌ ఎనర్జీ, ఫిట్‌నెస్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్న రవితేజ.. ఫిట్‌నెస్‌ను ఎప్పటికీ వదులుకోవద్దని సూచించారు.

ఇక సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్‌ను ‘ఇరుముడి’కి సోల్‌గా అభివర్ణించారు రవితేజ. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ఎంతో బలాన్నిచ్చిందన్నారు. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో వచ్చిన రీల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రేక్షకుల్లో భావోద్వేగాన్ని పెంచాయని తెలిపారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, సంగీతం చూసి తన కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగానికి గురయ్యారని రవితేజ వెల్లడించారు.

సోషల్ మీడియాలో ఇస్తున్న స్పందన తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ‘ఇరుముడి’ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే కనిపిస్తోందని చెప్పారు. 80 ఏళ్లు దాటిన కొందరు కూడా 20-25 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్‌కు వచ్చి సినిమా చూశారని తెలుసుకుని ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. సినిమా ఎడిటింగ్‌ రూమ్‌లో తొలిసారి చూసినప్పుడే తాను ఊహించని విధంగా ఎమోషనల్‌ అయ్యానని రవితేజ వెల్లడించారు. సాధారణంగా తనకు త్వరగా కన్నీళ్లు రావని, తనది స్టోన్‌ హార్ట్‌ లాంటిదని సరదాగా చెప్పిన ఆయన.. ‘ఇరుముడి’లోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేంత భావోద్వేగంగా ఉన్నాయని అన్నారు.

దర్శకుడు శివ తనకు కథ చెప్పినప్పుడు త్రినాథ్‌ పాత్ర తొలుత నచ్చలేదని, అయితే ‘ఇరుముడి’ అనే టైటిల్‌, కథ మొత్తం విన్న తర్వాత సినిమాపై నమ్మకం ఏర్పడిందని తెలిపారు. షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే ఇది సూపర్‌హిట్‌ అవుతుందని శివ చెప్పేవాడని, ఏదైనా తేడా వస్తే ఊరికి వెళ్లిపోతానని కూడా చెప్పినట్లు గుర్తుచేశారు. శివ నమ్మకం ఇప్పుడు నిజమైందని రవితేజ అన్నారు. సినిమా క్లైమాక్స్‌ చూసి ప్రేక్షకులు ఎంతో ఎమోషనల్‌ అవుతున్నారని, చివరి 20 నిమిషాల్లో థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు శివను వేదికపైకి పిలిచి హగ్ చేసుకున్నారు. ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు మాత్రమే కాకుండా.. శివలోని నిజాయితీ, వ్యక్తిత్వం, కాన్విక్షన్‌ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. భారీ విజయం సాధించినా శివలో ఎలాంటి మార్పు రాలేదని, గతంలో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడని ప్రశంసించారు. నిర్మాతలు నవీన్‌, రవి, దర్శకుడు శివకు రవితేజ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇరుముడి’లాంటి అద్భుతమైన సినిమాలో భాగం చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పారు. అలాగే హీరోయిన్‌ ప్రియను కూడా ప్రశంసించారు. సెకండ్‌ హాఫ్‌లో ఆమె చేసిన కీలక సన్నివేశం చాలా బాగా వచ్చిందని, ఒక ఆర్టిస్ట్‌ మాత్రమే చేయగలిగే పాత్రను ఆమె అద్భుతంగా పోషించిందన్నారు. నక్షత్రను ‘బేబీ సూపర్‌స్టార్‌’గా అభివర్ణించిన రవితేజ.. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, సినిమా చూసిన వారికి ఇప్పటికే అర్థమైందన్నారు. ఆమెకు మంచి భవిష్యత్‌ ఉండాలని ఆకాంక్షించారు. శివ తండ్రి గురించి చెప్పిన విషయాలు తనకు ముందుగా తెలియవని, ఆయన తల్లి గొప్ప వ్యక్తి అంటూ ప్రస్తావించారు. చివరగా ‘ఇరుముడి’ విజయాన్ని పురస్కరించుకుని రవితేజ, నిర్మాతలు నవీన్‌, రవి, దర్శకుడు శివ తదితరులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. సినిమా విజయంలో కథే తనకు ప్రధానమని, కథ ప్రేక్షకులను నిరంతరం ముందుకు తీసుకెళ్లేలా ఉండాలని తాను నమ్ముతానని రవితేజ తెలిపారు…