హిమాలయ నేపాల్లో మెరుపు వరదలు సంభవించాయి. భోటే కోషి నదికి ఆకస్మిక వరద పోటెత్తి నువాకోట్, ధాడింగ్ జిల్లాలను ముంచెత్తింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది చనిపోగా…105 మంది భారతీయులతో సహా పలువురు గల్లంతయ్యారు. నేపాల్ మీడియా నివేదికల ప్రకారం… టిబెట్ సరిహద్దువైపు వచ్చి వచ్చిన వరద.. విస్తృత నష్టాన్ని కలిగించి, అనేక గ్రామాలను ఊడ్చిపెట్టింది. నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో ఇప్పటివరకు కనీసం ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్లు కేంద్ర పోలీసు అధికార ప్రతినిధి డీఐజీ అభినరాయణ్ కఫ్లేను ఉటంకిస్తూ నేపాల్ న్యూస్ నివేదించింది.
నేపాల్ టూరిజం బోర్డు ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతంలోని 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీలు సహా కనీసం 384 మంది గల్లంతయ్యారు. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. రసువా జిల్లాలో కనీసం 26 మంది నేపాల్ పోలీసు సిబ్బంది గల్లంతయ్యారని అధికారి పేర్కొన్నారు. సాయుధ పోలీసు దళానికి చెందిన ఏడుగురు సిబ్బంది కూడా గల్లంతయ్యారని ఆ శాఖ పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతానికి నేపాల్ సైన్యం హెలికాప్టర్లను, విపత్తు సహాయక సిబ్బందిని మోహరించింది. ‘నష్టం వివరాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది’ అని ఒక ప్రకటనలో తెలిపింది.
నేపాల్ ఉత్తర జిల్లాలను బుధవారం భారీ వరద ముంచెత్తింది. వరద ధాటికి రోడ్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నేపాల్ విద్యుత్ అథారిటీ (NEA) తెలిపిన వివరాల ప్రకారం.. రసువాగఢి, చిలిమే, త్రిశూలి 3A, త్రిశూలి 3B హబ్ 220 kV సబ్స్టేషన్, త్రిశూలి జలవిద్యుత్ కేంద్రం, దేవిఘాట్ జలవిద్యుత్ కేంద్రం సహా కనీసం ఆరు ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో పలు జాతీయ రహదారులను కూడా మూసివేసినట్టు అధికారులు తెలిపారు.