పర్వతాల ఒడిలో ఉన్న నేపాల్‌ను ఊహించని విపత్తు అతలాకుతలం చేసింది. భోటెకోశి, త్రిశూలి నదీ వ్యవస్థల పరిధిలో ఒక్కసారిగా విరుచుకుపడిన భయానక వరదలు సృష్టించిన విధ్వంసానికి ఇప్పటివరకు దాదాపు 469 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు వెయ్యి మంది జాడ లేకుండా పోయారు..రాళ్లు, బురద కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయినప్పటికీ, అంతర్జాతీయంగా పలు శక్తివంతమైన దేశాల నుంచి వచ్చిన సహాయ ఆఫర్లను నేపాల్ ప్రభుత్వం తిరస్కరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
‘మా దేశాన్ని మేమే కాపాడుకుంటాం’.. దళాలను వద్దన్న ప్రభుత్వం..
ఈ మహా విషాదం సంభవించిన వెంటనే భారత్, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి అనేక దేశాలు తమ స్వంత ప్రత్యేక సహాయక బృందాలను నేపాల్‌లోకి పంపేందుకు అనుమతి కోరాయి. భారతీయులు సహా అనేక విదేశీయులు గల్లంతు కావడంతో ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే నేపాల్ విదేశాంగ శాఖ ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించింది. తమ దేశానికి చెందిన ఆర్మీ, పోలీసు వ్యవస్థలకే ఈ ఆపరేషన్ నిర్వహించే సామర్థ్యం ఉందనడమే కాకుండా, విదేశీ రెస్క్యూ టీమ్‌ల అవసరం ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది.