యురేనియం వ్యర్థాల ఎఫెక్ట్.. ఆ ఊరు వెళ్లి పోతానంటోంది..!

యురేనియం తవ్వకాలు.. గ్రామాలకు కష్టాలు!
టెయిలింగ్ పాండ్‌తో తీవ్ర ఇబ్బందులు.. ఎత్తు పెంచుతామంటే భయాందోళనలో ప్రజలు

కడప: యురేనియం.. అత్యంత విలువైన ఖనిజాల్లో ఒకటి. దేశ ఇంధన అవసరాల్లో కీలక పాత్ర పోషించే ఈ ఖనిజాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోని వేముల మండలం ఎం.తుమ్మలపల్లె వద్ద తవ్వి తీస్తున్నారు. ఇందుకోసం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2007లో తవ్వకాలు ప్రారంభం కాగా.. 2013 నుంచి ఉత్పత్తి కొనసాగుతోంది.

అయితే యురేనియం ఉత్పత్తి తర్వాత వెలువడే వ్యర్థాలే ఇప్పుడు స్థానిక ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ముడి ఖనిజాన్ని శుద్ధి చేసిన అనంతరం వెలువడే వ్యర్థాలను కనంకిందకొట్టాల సమీపంలో ఏర్పాటు చేసిన టెయిలింగ్ పాండ్‌లో నిల్వ చేస్తున్నారు. ఈ వ్యర్థాల కారణంగా పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

475 ఎకరాల సాగు భూమిపై ప్రభావం?

కనంకిందకొట్టాల గ్రామంలో సుమారు 125 ఇళ్లు, 500 మందికి పైగా జనాభా ఉన్నారు. గ్రామ పరిధిలో దాదాపు 475 ఎకరాల సాగు భూమి ఉంది. గతంలో ఇక్కడ అరటి, మిరప, టమాట, వేరుసెనగ, పత్తి, అలసంద, పెసర తదితర పంటలను సాగు చేసుకుంటూ ప్రజలు జీవనం సాగించేవారు.

అయితే 2016 తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు. యురేనియం వ్యర్థాల లీకేజీ కారణంగా సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోందని, కొందరు రైతులు భూములను సాగు చేయకుండా బీడుగా వదిలేస్తున్నారని పేర్కొంటున్నారు.

పాండ్‌ ఎత్తు పెంచడంపై ఆందోళన

టెయిలింగ్ పాండ్ గ్రామానికి సమీపంలో ఉండటంతో దుమ్ము, ధూళి సమస్య కూడా ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు. పాండ్ నుంచి వచ్చే దుమ్ము గాలిలో కలవడం వల్ల కొందరికి దద్దుర్లు, కీళ్లనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పాండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్న గ్రామస్థులు.. టెయిలింగ్ పాండ్ ఎత్తును మరింత పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాండ్ ఎత్తు పెరిగితే భవిష్యత్తులో సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

పరిహారం.. పునరావాసం కల్పించాలి

సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కనంకిందకొట్టాల గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంతో పాటు ప్రభావితమవుతున్న భూములను సేకరించి, తగిన పరిహారం అందించడంతో పాటు పునరావాసం కల్పించాలని కోరుతున్నారు.

మరోవైపు ఈ అంశంపై పరిశ్రమ అధికారులు తమ పరిధిలో పరిష్కారం చూపడం సాధ్యం కాదని చెబుతున్నట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

యురేనియం తవ్వకాలు, ఉత్పత్తి ప్రక్రియతో పాటు వ్యర్థాల నిర్వహణపై శాస్త్రీయంగా, పారదర్శకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి కనంకిందకొట్టాల గ్రామస్థుల ఆందోళనలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.